రేవంత్ రెడ్డిపై కేసు నమోదు: ఎందుకంటే?
హైదరాబాద్/మహబూబ్‌నగర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగర్‌కర్నూలు జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఎస్పీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరికల సందర్భంగా రేవంత్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చాలామంది టీఆర్ఎస్ నేతలకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

అంతేగాక, త్వరలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్లందర్నీ గుడ్డలు ఉడదీసి కొడతామని హెచ్చరిస్తూ.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా తాము ఒక రెడ్‌బుక్ రెడీ చేశామని, ఆ రెడ్ బుక్‌లో పోలీసులు ఎవరైతే టీఆర్ఎస్‌కి అనుకూలంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి పేర్లు రాశామన్నారు. తాము అధికారంలోకి రాగానే రెడ్ బుక్ ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
పోలీస్ అధికారులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. పోలీసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు డిమాండ్ చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ పై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి పై 153, 506, 504 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications