మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, సీనియర్ న్యాయవాదిపై కేసు నమోదు
హైదరాబాద్: మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల, హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణపై సీపీఎస్‌లో కేసు నమోదైంది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ. 7 కోట్లు తీసుకుని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు. రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. రూ. 7 కోట్లకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.
విడతలవారీగా రూ. 4 కోట్లు, రూ. 3 కోట్లు చెల్లించినట్లు బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులు తెలిపారు. అయితే, కోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని న్యాయవాది వెంకటరమణను కోరారు యాదగిరి. దీంతో రూ. కోటి ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకుండా మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, మరో వ్యక్తితో కలిసి బెదిరింపులకు దిగినట్లు యాదగిరి తెలిపారు.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, న్యాయవాది వెంకటరమణ, మరో వ్యక్తిపై సీపీఎస్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
బినామీ ఆస్తులు: ఎంఎస్ కింగ్స్ గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు
ఎంఎస్ కింగ్స్ గ్రూప్ కంపెనీల్లో రెండు రోజుల క్రితం సోదాలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వెల్లడించింది. సంస్థ యజమానులుగా ఉన్న మహ్మద్ షావనాజ్, జుబైరుద్దీన్ సహా పలువురి నివాసాల్లో సోదాలు చేసినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చినట్లు ఈడీ గుర్తించింది. యూఏఈ, యూకే నుంచి నిధులు హవాలా మార్గంలో వచ్చినట్లు తెలిపింది.
ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహించి రూ. 76.5 లక్షల నగదు, రూ. 1.5 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ, హవాలా డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications