కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు: బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: చేవెళ్ల బీఆర్ఎస్ రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది. బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డికి జనవరి 17న బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్ చేశారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావ్.. సర్పంచులతో ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ రంజిత్ రెడ్డి తనతో అసభ్యంగా మాట్లాడారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో జనవరి 20న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్‌లో తనను దూషించాడని, బెదిరింపులకు పాల్పడ్డారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఫిర్యాదు సమయంలో తనను బెదిరించిన వ్యక్తి ఎవరనేది విశ్వేశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించలేదు. పోలీసులకు మాత్రం రంజిత్ రెడ్డి పేరు చెప్పినట్లు తెలిపారు.

సంస్కారంలేని వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి వ్యక్తులను తాను పట్టించుకోనని.. కానీ, పార్టీ పెద్దల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కొండా నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉండగా.. అదే స్థానం నుంచి మరోసారి ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే స్థానికంగా పట్టు నిలుపుకోవడం కోసం ఇద్దరు నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.












Click it and Unblock the Notifications