తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన: పూర్తి షెడ్యూల్ ఇదే
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సన్నాహాకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
మూడు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతోపాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. అక్టోబర్ 3వ తేదీన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై చర్చించనుంది.

మరోవైపు, ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో కూడా సమావేశం కానుంది ఈసీ బృందం. ఈ చర్చలో డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాల నోడల్ అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షించనుంది.
ఇక జిల్లాలవారీగా ఎన్నికల ప్రణాళిక ఏర్పాట్లపై సమీక్షించనుంది. మూడో రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ, తదితర అధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం బృందం సభ్యులు. ఓటర్ల అవగాహనా కార్యక్రమాలపైనా దృష్టి సారించనున్నారు. ఓటర్ల జాబితా, పౌరుల భాగస్వామ్యానికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఈసీ బృందం సమావేశం కానుంది.
ఇప్పటికే కొత్త ఓటర్లు తమ పేరును నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు యువతను కోరిన విషయం తెలిసిందే. అంతా అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications