ఢిల్లీలో తెలంగాణ హీట్.. అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ.. మంత్రుల పడిగాపులు
ఢిల్లీలో తెలంగాణ రాజకీయం కాకరేపుతోంది. కత్తులు దూసుకుంటున్న టీఆర్ఎస్ మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు దేశ రాజధానిలో మకాం వేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడే పేడో తేల్చుకునేందుకు మంత్రులు సిద్దమయ్యారు. కేంద్ర మంత్రులతో భేటీ కోసం పడిగాపులు పడుతున్నారు. అటు అధికార టీఆర్ఎస్ ఎలా ఎదుర్కొవాలన్న దానిపై తెలంగాణ బీజేపీ నేతలు కమలం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.

అమిత్ షాతో కీలక భేటీ
బీజేపీ అధిష్టానం పిలుపుతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. వారంతా కేంద్ర హోం శాఖ మంత్రి, బీజీపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఢిల్లీకి చేరుకున్నవారిలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ , రాష్ట్ర అధ్యఓడు బండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు , సీనియర్ నేతలు విజయశాంతి, డికే అరుణతో పాటు ఇటీవల పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న, విఠల్ ఈ భేటీలో పాల్గొననున్నారు. అటు కేసీఆర్ ప్రభుత్వ పాలనపై పూర్తి వివరాలను అమిత్ షాకు అందించనున్నట్లు సమాచారం.

కేసీఆర్ సర్కాన్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహం ..
మరో ఏడాదిన్నరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని బీజేపీని ఎలా విస్తరింపచేయాలన్న దానిపై వారికి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. రైతుల ప్రయోజనాలు , వడ్ల కొనుగోలు , నిరుద్యోగం, ఇంటర్ విద్యార్థుల సమస్యలు, టీఆర్ఎస్ హామీలు వంటి అంశాలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మరింత దూకుడుతో ముందుకు వెళ్లాలని తెలంగాణ నేతలకు హైకమాండ్ ఇప్పటికే పలు సూచనలు చేసింది..

రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రపై క్లారిటీ
అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడతపై కూడా ఈసమావేశంలో చర్చించనున్నారు. దక్షిణ తెలంగాణలో రెండో విడత పాదయాత్రను ఈనెల 27 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర నేతలు సన్నాహాలు చేస్తున్నారు . అయితే కేంద్ర పెద్దల నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యాత్రపై ఈ భేటీలో స్పష్టత రానుంది.

ఢిల్లీలో మంత్రుల పడిగాపులు
మరో వైపు తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే మూడు రోజుల నుంచి మకాం వేశారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి షీయూష్ గోయల్ తో భేటీ కోసం పడిగాపులు కాస్తున్నారు. రెండు రోజుల నుంచి ముంబై పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ధాన్యం కోనుగోలుపై గోయల్ వద్ద తేల్చుకుంటాని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలా.. లేదా అన్నది కేంద్రం ఇచ్చే హామీపై ఆదారపడి ఉంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications