తెలంగాణా టీడీపీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నంలో చంద్రబాబు.. కేసీఆర్ వల్లేనా; పొలిటికల్ ఇంట్రెస్ట్!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయడానికి దృష్టిసారించిన ఆయన, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావడం కోసం రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీకి గతంలో పట్టు ఉన్న కొన్ని ప్రాంతాలపై ఫోకస్ చేస్తున్న ఆయన నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు. చంద్రబాబు తెలంగాణా పర్యటన రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు ఖమ్మం వేదికగా ఏం మాట్లాడతారు?
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుదేలైన సమయంలో చంద్రబాబు పర్యటన మళ్లీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకు వస్తుంది. అయితే చంద్రబాబు పర్యటన తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుస్తుంది అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది . ఇక నేడు ఖమ్మం వేదికగా జరగనున్న బహిరంగసభలో చంద్రబాబు ఏ అంశాలపైన ప్రధానంగా మాట్లాడతారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని బీఆర్ఎస్ పార్టీ ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణా టీడీపీని ట్రాక్ లో పెట్టే పనిలో చంద్రబాబు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు ఉంది. ఇప్పటికే పార్టీకి సానుభూతిపరులు, పార్టీ కేడర్ కొంత ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ హవా బాగా కొనసాగుతున్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలను కట్టబెట్టారు ఖమ్మం ప్రజలు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఖమ్మం పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. ఖమ్మం పైన మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్న చంద్రబాబు క్షేత్రస్థాయిలో టిడిపికి ఇంకా బలమున్న స్థానాలలో బహిరంగ సభలు నిర్వహించి పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకురావడానికి, తెలంగాణ టీడీపీ ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఉనికి కోల్పోయిన టీడీపీ కోసం తెలంగాణాలో బాబు రంగంలోకి
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన తర్వాత క్రమంగా తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. టిడిపిలో ఉన్న కీలక నాయకులు అందరూ బీఆర్ఎస్ బాటపట్టారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పట్టున్న మంచి నాయకులు లేని పరిస్థితి పార్టీలో నెలకొంది. పార్టీ ఉనికిని కోల్పోయిన సమయంలో చంద్రబాబు మళ్ళీ పార్టీ కోసం రంగంలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఒకపక్క కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలో రంగంలోకి దిగుతుంటే చంద్రబాబు ఇక్కడ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవ్వాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఆ జిల్లాల లోనూ చంద్రబాబు బహిరంగ సభలు.. టార్గెట్ కేసీఆర్?
ఈ సమయంలో చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం పై ఎందుకు దృష్టి పెట్టారు ఉన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా తోపాటుగా చంద్రబాబు నాయుడు వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లో కూడా బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికలలో పోటీ చేసినంత మాత్రాన టీడీపీ గెలుస్తుంది అన్న భావన లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టడం వెనక కెసిఆర్ కు చెక్ పెట్టే లక్ష్యం కనబడుతుందని అందుకే తెలంగాణా టీడీపీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications