ఏం జరుగుతోంది?: మంత్రులతో బాబు హడావుడి భేటీ, కేసీఆర్‌పై మత్తయ్య కేసు సీఐడీకి
హైదరాబాద్/విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారం కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుసగా భేటీ అవుతున్నారు. చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దీంతో, ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.
సబ్ కమిటీ భేటీని రద్దు చేసుకొని చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన భేటీ అయ్యారు.
వారితో తాజా పరిణామాల పైన చర్చిస్తున్నారని తెలుస్తోంది. తనకు నోటీసులు ఇస్తే ఏం చేయాలి? కేసీఆర్ పైన ఏపీలో నమోదైన కేసులపై ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. భేటీకి సుజనా చౌదరి, సీఎం రమేష్ కూడా హాజరయ్యారు. అంతకుముందు సుజన గవర్నర్‌తో భేటీ అయ్యారు.మంత్రులతో సమావేశానికి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ కూడా హాజరయ్యారు.

నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వద్ద భద్రత
నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సోమవారం నుండి ఒక ప్లటూన్ బలగాలతో భద్రత కొనసాగుతోంది. అనుమతిలేకుండా ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు 14 వస్తువులు అందాయి.
మత్తయ్య పెట్టిన కేసు సీఐడీకి బదలీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఓటుకు నోటు వ్యవహారంలో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు సీఐడీకి బదలీ అయింది. కేసీఆర్ పైన మత్తయ్య తీవ్ర ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇది సీఐడీకి బదలీ అయింది.












Click it and Unblock the Notifications