'నయీంను విషనాగు చేసింది చంద్రబాబే'
సంగారెడ్డి : నయీం లాంటి వ్యక్తులను కోవర్టులుగా మార్చిందెవరు..? ఎవరి అవసరార్థం నయీంను నక్సల్స్ మీదకు ఎక్కుపెట్టారన్నది జగమెరిగిన సత్యమే. పెంచి పోషించెదెవరైనా..! ప్రభుత్వాలకే ప్రమాదకరంగా మారినప్పుడు ఏరివేత మొదలవడం.. అందులో గ్యాంగ్ స్టర్ లంతా తుడిచిపెట్టుకోవడం ఏళ్లుగా జరుగుతున్నదే.
తాజా నయీం ఎన్ కౌంటర్ పై స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నయీం గ్యాంగ్ ను పెంచి పోషించిన విషనాగు చంద్రబాబేనని' సంచలన కామెంట్స్ చేశారాయన. ప్రజా కళాకారులను, పౌర హక్కుల నేతలను, ప్రజా సంఘాల నాయకులను పొట్టనబెట్టుకున్న నర రూప రాక్షసుడు నయీం అని మండిపడ్డారు లింగారెడ్డి.
చంద్రబాబు అండదండలతోనే :
నయీంను వెనుకుండి నడిపించిందంతా చంద్రబాబే అన్న తరహాలో వ్యాఖ్యలు చేసిన ఆయన.. 'చంద్రబాబు అండదండలతోనే నయీం గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎదిగాడని' ఆరోపించారు. నక్సలైట్లను అణిచేయడం కోసం నయీం లాంటి బ్లాక్ కోబ్రాలను చంద్రబాబే పోషించారని విమర్శించారు.

తనపై కూడా నయీం బెదిరింపులకు పాల్పడిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చిన లింగారెడ్డి.. 2004లో ఒకసారి, 2008లో ఒకసారి నయీం తనపై బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలిపారు. 2008లో తన అనుచరులను చిట్టాపూర్ గ్రామానికి పంపించిన నయీం.. తనను చంపేస్తామంటూ బెదిరించి వెళ్లారని, బెదిరింపులపై అప్పట్లోనే సిద్దిపేట పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాయకులు, అధికారులు అందరూ నయీం చేతిలో కీలుబొమ్మలుగా మారారని, 20 ఏళ్లుగా తన నేర సామ్రాజ్యానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. తన నియోజకవర్గమైన దుబ్బాక పరిసర ప్రాంతాల్లో నయీం గ్యాంగ్ ముగ్గురిని కిడ్నాప్ చేసిందని, ఇప్పటికీ ఆ వ్యక్తుల జాడ తెలియలేదని అన్నారు లింగారెడ్డి.
ఇదంతా బోనస్ జీవితమే
20 ఏళ్ల క్రితం.. గిరాయిపల్లి ఎన్ కౌంటర్ లోనే తాను అమరున్ని కావాల్సిందని, అయితే తన అదృష్టం బాగుండడంతో బ్రతికి బయటపడ్డానని చెప్పారు. తనకు ప్రాణాల మీద తీపి, ఆశ లేకపోయినా.. ఇప్పుడున్న జీవితం, ఎమ్మెల్యే పదవి.. రెండూ తనకు బోనస్ అని లింగారెడ్డి పేర్కొన్నారు.
నయీం లాంటి హంతకులు బెదిరింపులు తనకు వెంట్రకతో సమానమని.. ఇప్పటికీ గన్ మెన్స్ లేకుండా ప్రజల్లో తిరగ్గలుగుతున్నానని అన్నారు. అయితే మంత్రి హరీశ్‌రావు సీఎం సలహా మేరకు.. ఒక్క గన్ మెన్ ను మాత్రం నియమించుకున్నట్లుగా తెలిపారు. నయీంను చంపడంతో ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగిందని.. తనకు దుబ్బాక ప్రజలే రక్షణ కవచాలని అన్నారు.












Click it and Unblock the Notifications