సంస్కారవంతులైన పిల్లల్ని కనడానికి గర్భిణీలు ఆ పని చేయాలి- తెలంగాణ గవర్నర్ సలహా
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వృత్తిరీత్యా ఆమె గైనకాలిజిస్ట్ కూడా. తమకు పుట్టబోయే బిడ్డలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పొందడానికి గర్భిణీలు సుందరకాండ పారాయణం చేయాాలని సూచించారు. అలాగే- రామాయణం వంటి ధార్మిక గ్రంధాలు, పురాణాలను చదవాలని అన్నారు. ఆధ్యాత్మిక చింతనతో గడపాలని చెప్పారు.
ఢిల్లీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ విభాగం సంవర్ధిని న్యాస్ నిర్వహించిన గర్భ సంస్కార్ కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. గర్భిణీలకు పలు సూచనలు చేశారు. గర్భంతో ఉన్నప్పుడు సుందరకాండను పారాయణం చేయడం వల్ల పుట్టబోయే బిడ్డ సంస్కారవంతుడిగా, దేశభక్తుడిగా మారుతాడని అన్నారు. గర్భస్థ శిశువు నుంచే దేశం పట్ల భక్తి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.

సంవర్ధిని న్యాస్‌లో పని చేసే డాక్టర్లు నాణ్యమైన మందులతో పాటు గర్భిణీలకు శాస్త్రీయ, సంప్రదాయ విలువలను తెలియజేసే ప్రిస్క్రిప్షన్‌లను రాసిస్తారని ప్రశంసించారు. రామాయణం, భగవద్గీత వంటి గ్రంథాలను చదవడం, మంత్రోచ్ఛారణ చేయడం, యోగా సాధన వంటివి ప్రిస్క్రిప్షన్లలో ఉంటాయని అన్నారు. ఈ ప్రక్రియ గర్భధారణకు ముందు ప్రారంభమవుతుందని, శిశువుకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
గర్భ సంస్కార్ ప్రోగ్రామ్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేసినందుకు సంవర్ధినీ న్యాస్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. వారికి కృతజ్ఞత తెలియజేశారు. గర్భధారణకు ఈ శాస్త్రీయ, సమగ్ర విధానాన్నిఅమలు చేయడం వల్ల ఖచ్చితంగా సానుకూల ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. గ్రామాల్లో రామాయణం, మహాభారతం, ఇతర ఇతిహాసాలు, అలాగే మంచి కథలను చదివి వినిపించే తల్లులు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు.

తమిళనాడులో గర్భిణీలు కంభ రామాయణంలోని సుందరకాండాన్ని నేర్చుకుంటారని తమిళిసై అన్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు సుందరకాండను పారాయణం చేయడం పిల్లలకు మంచిదని సూచించారు. గర్భధారణకు శాస్త్రీయ విధానం అవసరమని, పీరియడ్ కాలంలో ఏర్పడే శారీరక ఇబ్బందులను నివారించడానికి గర్భిణీలు ఆరోగ్యకరమైన, శిశువులకు జన్మనివ్వడానికి ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications