సికింద్రాబాద్- గోవా ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్, హాల్ట్ స్టేషన్ల వివరాలు ఇవే..!!
Secunderabad to Goa: సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. సురక్షితంగా గోవా వెళ్లి రావొచ్చు. రోడ్డు మార్గంలో వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా కేంద్రం చొరవ తీసుకుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న కొత్త రైలు సర్వీస్‌కు పచ్చజెండా ఊపింది.
సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడగామా మధ్య కొత్త రైలు సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇది డైరెక్ట్ ట్రైన్ సర్వీస్. ఈ రెండు నగరాల మధ్య నేరుగా రైలును నడిపించాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభించింది.

ఈ విషయాన్ని రైల్వే శాఖ సహాయమంత్రి వీ సోమన్న వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్- వాస్కోడగామా మధ్య రైలును నడిపించడం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ- గోవా మధ్య రాకపోకలు మరింత విస్తృతమౌతాయని చెప్పారు.
ఈ ఎక్స్‌ప్రెస్ కంప్లీట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది రైల్వే బోర్డు. బై- వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా దీన్ని నడిపించనున్నట్లు బోర్డు డైరెక్టర్ సంజయ్ ఆర్ నీలం తెలిపారు. వారానికి రెండుసార్లు సికింద్రాబాద్- వాస్కోడగామా మధ్య రాకపోకలు సాగిస్తుంది. ప్రారంభంలో 10 బోగీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణను దృష్టిలో ఉంచుకుని దీన్ని పెంచుతారు.
ప్రతి బుధ, శుక్రవారాలు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రోజుల్లో ఉదయం 10:05 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే 17039 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు తెల్లవారు జామున 5: 45 నిమిషాలకు వాస్కోడగామాకు చేరుకుంటుంది. ప్రతి గురు, శనివారాల్లో ఉదయం 9 గంటలకు వాస్కోడగామా నుంచి బయలుదేరే నంబర్ 17040 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు తెల్లవారు జామున 6: 20 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్లు, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గదగ్, హుబ్లి, ధార్వాడ, లోండా, క్యాజిల్ రాక్, కులెం, శాన్వోర్‌డెమ్, మడ్గావ్ జంక్షన్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలును ఆమోదించినందుకు సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌కు థ్యాంక్స్ చెప్పారు.












Click it and Unblock the Notifications