ఛలో ఇందిరా పార్క్.!మరోసారి ఏకమవుతున్న అఖిలపక్షం.!నిరుద్యోగులకు అండగా దీక్ష.!
హైదరాబాద్ : నిరుద్యోగుల కోసం అఖిలపక్షం భరోసా పేరుతో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద జరగనున్న నిరసన దీక్షకు రాష్ట్రంలోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ జన సమితి అద్య క్షుడు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ పై సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని, రాసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
అఖిలపక్ష ఐఖ్యతా రాగం.. నిరుద్యోగులకు అండగా ఇందిరా పార్క్ లో దీక్ష :
అంతే కాకుండా వేలాదిమంది లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏడు సంవత్సరాలుగా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోగా పాలకులు పక్షాపత్రాలను అమ్ముకోవడం సిగ్గుచేటని కోదండరాం విమర్శించారు. నిరుద్యోగుల తల్లిదండ్రుల శాపం పరీక్షా పేపర్లను లీక్ చేసిన వారికి కచ్చితంగా తగులుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇందిరా పార్క్ లో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగుల నిరసన దీక్షకు నిరుద్యోగులు, విద్యార్థులు భారీగా తరలిరావాలని కోదండ రాం విజ్ఞప్తి చేసారు.

దద్దరిల్లనున్న ధర్నా ఛౌక్.. కదం తొక్కనున్న నిరుద్యోగులు :
అంతే కాకుండా మంగళవారం ఇందిరా పార్క్ లో నిర్వహించే సత్యాగ్రహ దీక్షకు నిరుద్యోగులు భారీగా తరలిరావాలని టీపిసిసి సీనియర్ నాయకుడు మల్లు రవి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్కు వద్ద అఖిల పక్ష సత్యాగ్రహ ధర్నా కార్యక్రమంలో మేధావులూ, రాజకీయ నేతలు పాల్గొంటున్నారన్నారు. విచ్చలివిడిగా జరిగిన పేపర్ లీక్స్ పై అఖిలపక్షం పోరాటం ఉదృతం చేస్తుందని కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసారు మల్లు రవి.

నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం.. పేపర్ లీకేజీలపై భగ్గుమన్న అఖిలపక్షం :
రాష్ట్రంలో పేపర్ లీక్ లతో నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు డాక్టర్ మల్లు రవి. తెలంగాణ కోసం పోరాటాలు చేసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో యువతకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న టీఎస్పీఎస్సి పేపర్ లీక్ ల విషయంలో సిట్టింగ్ జడ్జ్ తో కానీ, సిబిఐ తో కానీ విచారణ జరపాలని మల్లు రవి డిమాండ్ చేసారు.

ప్రభుత్వ పరాకాష్ట విధానాలు.. విద్యార్ధుల తరుపున పోరాటానికి సిద్దమన్న కాంగ్రెస్ :
ఇందుకోసం మంగళవారం ఉదయం ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని టీపీసీసీ పేపర్ లీక్స్ పోరాట కమిటీ చైర్మన్ మల్లు రవి పిలుపునిచ్చారు. ఈ విషయమై ఆయన ఒక ప్రకటన చేస్తూ యువకుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని, పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వ అలసత్వం పరాకాష్ట అని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా అఖిల పక్షం చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని మల్లు రవి అన్నారు.












Click it and Unblock the Notifications