కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. కొనలేమంటున్న సామాన్యులు!
తెలుగు రాష్ట్రాలలో మాంసాహార ప్రియులకు పెరుగుతున్న చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా చికెన్ ధరలు పెరగడంతో సామాన్యులు చికెన్ కొనుగోలు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. రంజాన్ పండుగతో పాటు, శుభకార్యాల సీజన్ కూడా కావడంతో చికెన్ కు గిరాకీ విపరీతంగా పెరుగుతుంది. అంతేకాదు ఎండాకాలం కావడంతో చికెన్ ఉత్పత్తి కూడా తగ్గడంతో డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేక చికెన్ ధరలు పెరిగాయి.
బాగా పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్ మార్కెట్లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర నిన్నటి వరకు 320 రూపాయలుగా ఉండగా, నేడు ఒక్కసారిగా 30 రూపాయలు పెరిగి 350 రూపాయలకు చేరింది. నాటుకోడి ధరలు కేజీకి ఏకంగా ఎనిమిది వందల రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇక ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు భారంగా మారింది.

చికెన్ ధరల పెరుగుదలకు కారణం ఇదే
ఎండల తీవ్రత కారణంగా కోళ్లు మృత్యువాత పడడంతో సరఫరా తగ్గగా, రంజాన్ సీజన్ కావడంతో కోడి మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో, ఆ డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేక ధరలు పెరిగాయి. చికెన్ ధరలు దాదాపు అర కిలో మటన్ రేటుకు పెరగడం చాలామంది వినియోగదారులకు తీవ్ర సంతృప్తిని కలిగిస్తుంది.
చికెన్ కు ప్రత్యామ్నాయం చూస్తున్న వినియోగదారులు
నాన్ వెజ్ లో కాస్త తక్కువ ధరకు దొరికే చికెన్ కూడా కొండెక్కి కూర్చుంటున్న క్రమంలో చాలామంది వినియోగదారులు చికెన్ కు ప్రత్యామ్నాయంగా చేపలను కొనుగోలు చేసుకుని తింటున్నారు. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పైన పెరిగిన చికెన్ ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
11.01 లక్షల టన్నులకు మాంసం వినియోగం
తెలంగాణ రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నప్పటికీ మాంసాహార వినియోగం చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక 2026 లో తెలంగాణ రాష్ట్రంలో మాంసం వినియోగం 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.30 లక్షల టన్నులు ఉండగా, 2024- 25 నాటికి అది అద్భుతంగా 11.01 లక్షల టన్నులకు చేరుతుందని వెల్లడించింది.
చికెన్ ధరలతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు
ఇది గత పదేళ్లలో మాంసాహారాన్ని వినియోగించే క్రమంలో సాధించిన అసాధారణమైనటువంటి వృద్ధి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పెరుగుతున్న చికెన్ ధరలు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్న భావనను ప్రజలకు కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications