పీజేఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజ్ - సీఎం రేవంత్ రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఆరు వరుసలు, 24 మీటర్ల వెడల్పుతో, 1.2 కి.మీ. పొడవున నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిలో దివంగత నాయకుడు పీజేఆర్ (పి.జనార్దన్ రెడ్డి) కీలక పాత్రను గుర్తుచేసుకున్నారు.
జంటనగరాల్లో 25 ఏళ్ల పాటు పీజేఆర్ శకం నడిచిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన ప్రజలకు పీజేఆర్ అండగా నిలిచారని, వారిపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే వెంటనే స్పందించేవారని తెలిపారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండేవారు. ప్రజా సమస్యలతో పాటు పార్టీకి ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేం. పీజేఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజీని తలపించేదని అన్నారు.

హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు రావడానికి పీజేఆర్ చేసిన కృషి మరువలేనిదని సీఎం పేర్కొన్నారు. ఈరోజు నగరంలో సురక్షితమైన మంచినీరు తాగుతున్నారంటే వారంతా పీజేఆర్‌ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైటెక్ సిటీగా మారిన శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతం గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేదని గుర్తుచేసిన సీఎం, పీజేఆర్ కృషి వల్లే హైటెక్ సిటీ గచ్చిబౌలికి మంజూరైందని చెప్పారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పునాది వేయగా, చంద్రబాబు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ ప్రాజెక్టును మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరిగినా, పీజేఆర్ అడ్డుపడి హైదరాబాద్‌లో నిలిపారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.












Click it and Unblock the Notifications