దారుణం: పందుల దాడిలో చిన్నారి దుర్మరణం
మహబూబ్‌నగర్: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. పందుల దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బల్సుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన నర్సింలు, కుర్మమ్మ దంపతులు దేవరకద్రలో యాచక వృతిచేస్తూ జీవించేవారు. నిరుడు నర్సింలు మృతి చెందడంతో కుర్మమ్మ యాచిస్తూ ఐదుగురు పిల్లలను పోషిస్తోంది. బుధవారం దేవరకద్రలో అంగడి ఉండటంతో సాయంత్రం కుర్మమ్మ ఐదు నెలల వయస్సు గల చిన్నకూతురు ఇంటి వద్దే ఉంచి దేవరకద్రకు యాచించడానికి వెళ్లింది.

గ్రామంలో విచ్చల విడిగా సంచరించే పందులు కుర్మమ్మ గుడిసెలోకి చొరబడి జోలెలో ఉన్న చిన్నారిని కిందికి లాగి కొంత దూరం వరకు లాక్కెళ్లాయి. చిన్నారి అక్క కొండమ్మ గుడిసెకు కొంత దూరంలో ఆడుకుంటోంది. పందులు కరుస్తుండగా ఏడుస్తున్న తన చెల్లెలిని చూసిన కొండమ్మ అరుస్తూ రాళ్లతో కొట్టగా పంది నోట్లోనుంచి పాపను వదిలింది.
రాత్రి ఇంటికి వచ్చిన తల్లికి కొండమ్మ జరిగిన విషయం చెప్పగా, గుడిసెల సమీపంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సరిగా చూసుకోలేక ఏడుస్తున్న పాపకు పాలిచ్చి పడుకోబెట్టింది. గురువారం ఉదయం లేచి చూసే సరికి పాప మృతిచెందింది.












Click it and Unblock the Notifications