అయ్యో.. ఐదేళ్ల బాలిక ప్రాణాలు తీసిన చైనా మాంజా
సంక్రాంతి పండగ పూర్తయి చాలా రోజులు కావొస్తున్నా అక్కడక్కడా చిన్నారులు గాలి పటాలను ఎగురవేస్తూనే ఉన్నారు. అయితే చైనా మాంజా పీకలు కోస్తూనే ఉంది. ఏటా చైనా మాంజాతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చైనా మాంజా వాహనదారుల మెడలు కోస్తున్నాయి. ఇటీవల పాతబస్తీలో రూ. 2 కోట్ల విలువైన చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా చైనా మాంజాకు మరో చిన్నారి బలైంది. చైనా మాంజా మెడకు చుట్టుకుని ఐదేళ్ల బాలిక మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తండ్రితో సరదాగా బయటకు వెళ్లిన ఆ చిన్నారి.. తిరిగి ఇంటికి రాలేదు.. అదే రోజు తనకు చివరి రోజు అవుతుందని ఆ చిన్నారి గ్రహించలేదు. కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ లో విషాదకరమైన ఘటన జరిగింది. తండ్రి బైక్ పై వస్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఆ ఫ్యామిలీ సంగారెడ్డి జిల్లా కాజీపల్లి నుంచి కూకట్ పల్లికి వస్తుండగా ప్రమాదం జరిగింది. కళ్ల ముందే చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి.
ఏం జరిగిందంటే..?
సంగారెడ్డి జిల్లా కాజీపల్లి నుంచి తండ్రితో పాటు ఇద్దరు కుమార్తెలు బైక్ పై కూకట్ పల్లి వస్తున్నారు. అయితే వివేకానందనగర్ వద్దకు రాగానే చైనా మాంజా బాలిక నిష్విక ఆదిత్య మెడకు గట్టిగా చుట్టుకుంది. దీంతో చిన్నారి అరవడంతో తండ్రి బైకు ఆపి చూసి మాంజా మెడకు చుట్టుకున్నట్లు గుర్తించాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతోంది. దీంతో చిన్నారి నిష్విక ఆదిత్యను సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక చైనా మాంజా ధాటికి హైదరాబాద్ మహా నగరంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో చైనా మాంజా విక్రేతలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చైనా మాంజాపై 2016 లోనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించినా కొందరు వ్యాపారులు అక్రమంగా వీటిని విక్రయిస్తున్నారు.












Click it and Unblock the Notifications