విషాదం: నిర్మాణంలో ఉన్న చర్చి కూలి, నలుగురు మృతి
సంగారెడ్డి: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోహిర్‌లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. చర్చి స్లాబ్ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు వారంతా శ్రమిస్తున్నారు. ఆదివారం నిర్మాణ పనులు జరుగుతుండగా చర్చి స్లాబ్ సడెన్ గా కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు. మరో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లారీని ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు: ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ సహా మరొకరు మృతి చెందారు. టీఎస్ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా మోచర్ల వద్ద లారీని బస్సు వెనకనుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో డ్రైవర్ వినోద్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. వీరిలో 65 ఏళ్ల వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications