కేంద్రం నుంచి స్పందన రాలేదు- తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు : కాళోజీ కవితలతో..!!
కేసులు పేరుకుపోవడానికి న్యాయమూర్తుల కొరత ఒక్కటే కాదని..సరియైనటువంటి మౌలిక వసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పని చేయలేకపోతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కోర్టుల్లో మౌలికవసతులు, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని ఎన్వీ రమణ అన్నారు.

కేంద్రం నుంచి స్పందన రాలేదు
కేంద్రం స్పష్టత ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చి కోర్టు భవనాలను నిర్మించింది. న్యాయ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఇది అని పేర్కొంటూ ఎన్వీ రమణ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించారు. న్యాయస్థానాల ఆధునీకరణ ద్వారానే సత్వర న్యాయం అందించ గలుగుతామని చెప్పినట్లు వివరించారు. తామె చేసిన ప్రతిపాదనల పైన న్యాయ మంత్రిత్వ శాఖ, కేంద్రం నుంచి సమాధానం రాలేదన్నారు.

పార్లమెంట్ లో చట్టం చేస్తారేమో చూడాలి
ప్రత్యేక సంస్థపై పార్లమెంట్ సమావేశాల్లో చట్ట రూపంలో తెస్తారని ఆశిస్తున్నానని జస్టిస్ రమణ అభిప్రాయ పడ్డారు. తన భావాలను అనుగుణంగా వరంగల్ కోర్టు భవన సముదాయాన్ని నిర్మించారని అభినందించారు. దీనినమిగతా రాష్ట్రాలకు పంపించి మోడల్ కోర్టు భవనంగా ఆచరించాలని చెప్పాలనుకుంటున్నానని చెప్పారు. ఇదే సమయంలో ఒకప్పుడు రాజకీయాల్లో న్యాయవాదుల సంఖ్య అధికంగా ఉండేదని గుర్తు చేసారు. ఇప్పుడు రాజకీయాల్లో న్యాయవాదుల సంఖ్య తగ్గిందని... ఈ సంఖ్యను పెంచి, సమాజానికి మంచి చేయాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

వరంగల్ తో అనుబంధం..కాళోజీ కవితలతో
కుటుంబం, వృత్తితో పాటు సమాజం, రాష్ట్రం, దేశం గురించి కూడా న్యాయవాదులు ఆలోచించాలి అని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కాళోజీ నారాయణ రావు కవితలను చదివి వినిపించారు. తెలుగులో మాట్లాడటం గర్వంగా ఉందని.. ఓరుగల్లుతో తనకు ఎంతో విడదీయరాని బంధం ఉందంటూ గుర్తుచేసుకున్నారు.. ప్రగతిశీల ఉద్యమాలకు పుట్టినిల్లు ఓరుగల్లు అని.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నేల అని.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి శతకాన్ని ప్రస్తావించారు.
న్యాయ వ్యవస్థ పైన కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంత కోర్టులో న్యాయ వాదులు ఇబ్బందులు పడుతున్న తీరు తన దృష్టికి రావడంతో మొబైల్ న్యాయ స్థానాలు ఏర్పాటు చేయాలని సూచించానని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications