తొలుగుతున్న సీఎం కేసీఆర్ ముద్ర: ప్రభుత్వ వ్యతిరేకులపైనే ‘ద్రోహ’ ముద్ర
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీలో ప్రకంపనలు స్రుష్టిస్తోంది. తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అవుతుందా? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఓటుకు నో
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతే 'అస్త్రం' రాజకీయాలు నడుపుతున్న తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల ముసుగులు తొలగిపోతున్నాయి. 14 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గానీ, అటు వరుసగా తొమ్మిదిన్నరేళ్ల పాటు సీఎంగా, పదేళ్ల పాటు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రికార్డు నెలకొల్పిన ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగ పూరిత రాజకీయం, వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుల వెనుక ముసుగు తొలగిపోతున్నది. రెండేళ్ల క్రితం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా చూడాలని కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్నాయని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ఆరోపణలు చేసేందుకు వెనుకాడలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అడ్డంగా చిక్కిన తర్వాత సాక్ష్యాధారాల సేకరణ పేరిట రెండున్నరేళ్లు సాగిపోయింది గానీ కేసు పురోగతి మాత్రం ముందుకు పడలేదు.
ఇదిలా ఉంటే మరో ఏడాదిన్నర కాలం మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో పొత్తుల రాజకీయంపై చర్చ భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతున్నదో అవగతమవుతూనే ఉన్నది. తెలంగాణ వ్యతిరేకులతో తెలంగాణ నాయకులు కూటమి కట్టారని ఇటీవల సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లోనూ ఆరోపణలకు దిగిన నేపథ్యం తెలంగాణ సీఎం కేసీఆర్‌ది. 2010 నుంచి 2014 వరకు తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా కోదండరాం చేపట్టిన ఉద్యమ కార్యాచరణను కూడా త్రుణీకరించి.. ఆయన్ను తెలంగాణ ద్రోహుల్లో కలిపేసేందుకు.. టీఆర్ఎస్ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు సీఎం కేసీఆర్ వెనుకాడలేదు.

సమైక్యాంధ్ర ఉద్యమంలో పయ్యావుల ఇలా కీలకం
కానీ తెలంగాణ ప్రభుత్వ పరిధిలో మాత్రం ఏపీలో అధికార టీడీపీ నేతలకు.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అవసరమైన కాంట్రాక్టులు, లైసెన్సులు యదేచ్ఛగా అందుతూనే ఉన్నాయి. అందునా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సాగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినా ఉరవకొండ నుంచి ఓటమి పాలై ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల కేశవ్‌తో సీఎం కేసీఆర్ చెట్టపట్టాలు వేసుకుని తిరుగడమేమిటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పని చేసిన పరిటాల రవీంద్ర తనకు మంచి మిత్రుడని, ఆయన కొడుకు పెళ్లికి హాజరైతే తప్పేమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. నిజమే ఇద్దరూ 1994 నుంచి 1999 వరకు టీడీపీలో కలిసి పనిచేశారు కనుక సహచర రాజకీయ నాయకుల కొడుకు పెళ్లికి వెళ్లడానికి అభ్యంతరమేమీ లేదు. కానీ పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీతకు హైదరాబాద్ నగరంలో వైన్ షాప్ నిర్వహణకు లైసెన్సులు మంజూరు చేయాల్సిన అగత్యం ఏమిటో అర్థం కావడం లేదని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకులపై ద్రోహులన్న ముద్ర వేసే యత్నం
అన్నింటికి మించి తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యతిరేకంగా నిలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకు పిలిచి మరీ మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యం సీఎం కేసీఆర్‌ది. కానీ తన ప్రభుత్వ పనితీరును వ్యతిరేకించే వారంతా తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి దశలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ నాయకత్వం.. మెత్తబడింది. తాజాగా పొత్తుల సంగతి బయటపడినా నోరు మెదపడం లేదు. అఫ్ కోర్స్. ఇది టీడీపీలో తెలంగాణ, ఏపీ నేతలకు సంబంధించిన అంశం. అయితే పరిణామాలను మాత్రం తెలంగాణ ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ సునిశితంగా గమనిస్తున్నదని వార్తలొస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయమే
టీడీపీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్తితి ఉంటే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. పరిటాల శ్రీరాం వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో ఏపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు, నేతలు అతిగా స్పందించడంతో తెలంగాణలో తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్న రేవంత్ రెడ్డి వాదనను విభేదించే వారు కష్టమే. కాకపోతే రాజకీయాల కోసం విమర్శలకు దిగడం సంగతి వేరే సంగతి. రెండు రోజుల క్రితం హస్తిన నుంచి తిరిగొచ్చిన రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉంటానంటూనే తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ టీడీపీ నేతల రహస్య ఒప్పందాలు, లావాదేవీల చిట్టా బయటపెట్టడంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో సమావేశమైతే తప్పేమిటని ఎదురు దాడి చేయడంతోనే ఆయన పార్టీ మారడం తథ్యం అన్న సంగతి తేలిపోయిందని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ తమ పార్టీలో రేవంత్ రెడ్డి చేరిక సంగతి తనకు తెలియదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా వ్యాఖ్యానించడం ఆసక్తికర పరిణామమే మరి.

ఇలా నారా లోకేశ్ మీడియాపై ఎదురు దాడి
చివరకు పరిస్థితి తీవ్రత అర్థం చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. రేవంత్ వద్దకు రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహనరావును రాయబారం పంపినా ఆపద మొక్కుల వ్యవహారంగానే పరిగణిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ కూడా.. రేవంత్ రెడ్డి వ్యవహారంపై మీడియాకే ఎదురు ప్రశ్నలు వేసేశారు. రేవంత్ పార్టీలోనే ఉంటానని చెప్పిన తర్వాత తననెలా సమాధానం అడుగుతారని నారా లోకేశ్ ఎదురు దాడికి దిగారు. ‘మీరే స్క్రోలింగ్ లు, బ్రేకింగ్ న్యూస్‌లు ఇచ్చి నన్ను వివరణ ఇవ్వమంటే నేనెలా ఇవ్వాలి' అని లోకేశ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఊహించినట్లుగానే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి విమర్శలపై నోరు విప్పాలంటేనే వణికి పోతున్నారు. ఆయన సూటిగా లేవనెత్తిన అంశాలకు వారి దగ్గర సమాధానం లేకుండాపోయింది. ప్రస్తుతం ఆ పార్టీలో ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

సమాదానం దాటేసిన ఏపీ మంత్రి దేవినేని
ఏపీ టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీ టీడీపీ నేతల్లో కలకలం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఏపీ టీడీపీ నేతల వ్యాపార లావాదేవీల చిట్టా విప్పడంతో వారంతా ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడి రూ.2వేల కోట్ల కాంట్రాక్ట్, పరిటాల, పయ్యావుల కుటుంబీకులకు బీర్ల కంపెనీల వ్యవహారాలను రేవంత్‌రెడ్డి బయటపెట్టడంతో ఏపీ మంత్రులు టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ విషయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించడానికి వెనకడుగు వేశారు. రేవంత్ రెడ్డి ఏపీ మంత్రులపై రేవంత్ విమర్శలను తమ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుతుందని ఆయన తప్పించుకున్నారు. ఇంకా ఎవరి లావాదేవీలు రేవంత్ రెడ్డి బయటపెడతారోనని వారు భయపడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో అసలు నిజాలు బయటపెడితే టీడీపీకి పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందనే ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా స్పందించలేదు. రేవంత్‌రెడ్డి తాము విమర్శిస్తే మళ్లీ ఏ విషయం బయటపెడతారో అని వారు మల్లగుల్లాలు పడుతున్నారు.












Click it and Unblock the Notifications