సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం... దళిత్ ఎంపవర్‌మెంట్‌పై అఖిలపక్ష సమావేశం...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దళితుల అభివృద్దికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 11.30గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలకు ఆహ్వానం అందింది. సీపీఐ,సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాలని సీఎం కేసీఆరే స్వయంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఫోన్ చేసి ఆహ్వానించారు.
'సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్' పథకంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల నుంచి దళిత ప్రజాప్రతినిధులు హాజరువతారు. అలాగే కాంగ్రెస్,బీజేపీ,ఎంఐఎం శాసనసభాపక్ష నేతలు కూడా ఇందులో పాల్గొంటారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమం,అభివృద్దిపై రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. దళిత్ ఎంపవర్‌మెంట్‌కు అవసరమయ్యే విధివిధానాలను రూపొందించనున్నారు.

రాజకీయ నేతలతో పాటు దళిత అభ్యున్నతికి కృషి చేస్తున్న,దళిత సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న పలువురు నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ,సీఎంవో అధికారులు,పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
కరోనా లాక్‌డౌన్ ఎత్తివేసిన నాటి నుంచి కేసీఆర్ అనూహ్య నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. జిల్లాల పర్యటనలతో జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఈ ఏడేళ్ల కాలంలో ఎప్పుడూ ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వనిది తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇవ్వడమే కాదు... మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కాంగ్రెస్ డిమాండ్లన్నింటికీ ఓకె చెప్పారు.తాజాగా దళిత్ ఎంపవర్‌మెంట్‌పై ఫోకస్ చేశారు. కొద్దిరోజుల క్రితం వరకు ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్... ఇలా ఉన్నట్టుండి వేగం పెంచడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.హుజురాబాద్ ఉపఎన్నికే దీని కారణమని ప్రత్యర్థులు అంటుంటే... అంతకుమించిన స్కెచ్ ఏదో కేసీఆర్ మదిలో ఉందన్న చర్చ కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications