పోలింగ్ వేళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన - రైతుబంధుపై ఇలా..!!
తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం రైతు బంధు నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వటం పైన రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. అదే విధంగా రైతుబంధు కాంగ్రెస్ కారణంగానే ఆగిందని...వారికి సిగ్గు ఉందాని కేసీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పై ఆగ్రహం:ఎన్నికల సంఘం రైతుబంధు నిలిపివేయటం పైన కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది రైతు బంధు పొందుతున్నారని.. దాన్ని ఆపడానికి వారికి సిగ్గు, మానం ఏమైనా ఉందా అంటూ మండిపడ్డారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. తాను రిక్వెస్ట్ చేస్తే.. ఈనెల 28న రైతుబంధు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఒప్పుకుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మరోసారి ఫిర్యాదు చేయడంతో.. రైతుబంధును కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆపేసిందని వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని ఓటర్లకు సూచించారు.

అసైన్డ్ భూములకు పట్టాలు:ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. ఏమీ ఉండలేదన్నారు. రైతుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇస్తున్నమని, అదృష్టం బాగాలేక రైతు చనిపోతే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా ఇస్తున్నమని, అంతేగాక రైతులు పండించిన పంటను ప్రభుత్వమే 7,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొంటున్నదని తెలిపారు. గెలిచిన తరువాత ఎకరానికి రూ.10 వేలుగా ఉన్న రైతుబంధును ఎకరానికి రూ.16 వేలు చేస్తానని చెప్పారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసానని..తెలంగాణ ఇప్పుడు ఒక దశలో పయణిస్తుందని చెప్పారు. తెలంగాణకు ఎవరి నాయకత్వం అవసరమో ఆలోచన చేయాల్సిన అవసం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. యుద్ధం చేసెటోని చేతుల కత్తి పెడితే ప్రయోజనం గానీ, అవతలోని చేతుల పెడితే లాభం ఉండదన్నారు.
పెన్షన్ పెంచుతాం:బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటామని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అసైన్డ్ భూములకు తొలి క్యాబినెట్ భేటీలోనే అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. ఎన్నికల తర్వాత క్రమంగా దళిత సోదరులందరికీ దళితబంధు వస్తుందని వివరించారు. కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ రాజ్యం ఏంటో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యం మరోసారి కావాలా అలోచన చేయాలన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ రూ 5 వేలు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications