బాబు దారిలో పారికర్‌కు కేసీఆర్ విందు, కరీంనగర్‌కు మారిన స్మార్ట్ సిటీ
హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గురు, శుక్రవారాలలో హైదరాబాదులో పర్యటించనున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం విందు ఏర్పాటు చేస్తోంది. పారికర్ రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు.
గతంలో, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి సురేష్ ప్రభు వచ్చినప్పుడు విందు ఇచ్చారు. మరో ఇద్దరు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, పోన్ రాధాకృష్ణన్‌లు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు విందు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ కూడా విందు ఇస్తుండటం గమనార్హం.

తెలంగాణ సీఎం కేంద్రంతో ఓ వైపు ఢీ అంటే ఢీ అంటూనే, మరోవైపు మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రి మనోహర్ పారికర్‌కు విందు ఇస్తుండటం గమనార్హం.
హైదరాబాద్ రానున్న మనోహర్ పారికర్ తెలంగాణ రాష్ట్రంతో పెండింగులో ఉన్న ఆర్మీ భూముల పైన చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఆదిభట్లలో టాటా బోయింగ్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదును కాకుండా కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్ బదులు కరీంనగర్‌ను చేర్చింది.
లక్ష కోట్లు వచ్చే అవకాశం: దత్తాత్రేయ
14వ ఆర్థిక సంఘం ద్వారా తెలంగాణకు లక్ష కోట్లు వచ్చే అవకాశముందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ గురువారం అన్నారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రధాని మోడీ పథకాలను పేదలు హర్షిస్తున్నారని చెప్పారు. ఫసల్ బీమా పథకం కరువు ప్రాంతాల రైతులకు ప్రయోజనకరమన్నారు. ఇందులో తెరాస ప్రభుత్వం భాగస్వామ్యం కావాలన్నారు.












Click it and Unblock the Notifications