కేంద్రం తీరును ఎండగట్టండి.. రాష్ట్ర హక్కుల కోసం పోరాడండి : ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడున్నారేళ్లైనా రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ ధోరణిని ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించారు.
పార్లమెంటులో కేంద్రం వైఖరిని ఎండగట్టాలి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. సుదీర్గంగా జరిగిన ఈ భేటీలో.. పార్లమెంటులో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ ధోరణిని ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.

ఎంపీలకు దిశానిర్దేశం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ఎంపీలకు సూచించారు. చట్టపరంగా , న్యాయ పరంగా రావాల్సినవి కూడా ఇవ్వకుండా కేంద్రం మొండి వైఖరి అవలంభిస్తోందని సమావేశంలో పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు అందజేశారు.

23 అంశాలతో నివేదిక
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డి మీడియాతో మాట్డాడారు. కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత దానికి అనుగుణంగా తాము స్పందిస్తామని తెలిపారు. కేంద్రానికి రావాల్సిన అంశాలలో తీసుకువచ్చేందుకు వెనుకడుగు వేసేది లేదన్నారు. ఇప్పటికే పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. మొత్తం 23 అంశాలతో కూడిన నివేదికను సీఎం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. విభజన చట్టంలోని హామీలపై ఎక్కువ దృష్టి సారిస్తామని చెప్పారు.

నిర్మాలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ
కాగా, ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కోసం కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ అభివృద్థికి ఆర్థిక సాయం చేసి తోడ్పాటు నందించాలని లేఖలో కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications