గెలుపు మనదే, కేసీఆర్ ధీమా వెనుక - "వాళ్ళ" తో టచ్ లో ఉండండి..!!
తెలంగాణలో అధికారం ఎవరిది. మరి కొద్ది గంటల్లోనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో హంగ్ వార్తలు కొత్త టెన్షన్ కు కారణమవుతున్నాయి. అయితే, కేసీఆర్ ధీమా వెనుక పెద్ద కసరత్తే కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ తాజాగా చేసిన దిశా నిర్దేశం కూడా ఆసక్తిగా మారుతోంది.
కౌంటింగ్ పై ఉత్కంఠ : మరి కొద్ది గంటల్లో తెలంగాణ ప్రజల తీర్పు ఏంటనేది తేలిపోనుంది. కాంగ్రెస్ గెలుపు ఖాయమనే అంచనాలకు కేసీఆర్ బ్రేకులు వేస్తున్నారు. తామే అధికారంలోకి రాబోతున్నట్లు పార్టీ నేతలకు చేస్తున్న మార్గ నిర్దేశం ఇప్పుడు కౌంటింగ్ వేళ కొత్త మలుపు తీసుకుంది. పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.

ఆదివారం వెలువడే ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉంటాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేసీఆర్‌తో భేటీ తర్వాత ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చిన నేతలంతా.. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొనడం గమనార్హం. అయితే, కేసీఆర్ చేసిన విశ్లేషణతో పార్టీ నేతల్లో గెలుస్తామనే ధీమా పెరిగింది. కానీ, లోలోపల మాత్రం స్పష్టత లోపిస్తున్నట్లు కనిపిస్తోంది.
గెలుపుపై కేసీఆర్ ధీమా : పార్టీ నేతలు ఎవరూ ఆగమాగం, పరేశాన్ ఎందుకు అయితున్నరు. మళ్లా మనమే గెలుస్తున్నం. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం. రెండు రోజులు నిమ్మళంగా ఉండండి. 3వ తేదీన అందరం కలసి సంబురాలు చేసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. ఓటింగ్ సరళి, ఇతర అంశాలపై సమీక్షించిన సందర్భంగా నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
మరోవైపు ఈ నెల 4న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. కేటీఆర్, హరీష్ తో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వార్‌రూమ్‌ల నుంచి, వివిధ వర్గాల నుంచి అందిన గణాంకాలు, నివేదికలతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జులు, అభ్యర్థుల నుంచి అందిన వివరాలను విశ్లేంచారు.

పోలింగ్ సరళిపై పోస్టుమార్టం : గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్‌లో ఓటింగ్ సరళిపైనా పోస్టుమార్టం చేశారు. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే ఓటింగ్‌లో పాల్గొన్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హంగ్ ఫలితాలకు అవకాశం లేదని, స్పష్టమైన మెజారిటీతోనే బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం.
పార్టీకి సైలెంట్ ఓటింగ్ పడిందని..తమకు కలిసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. బీఆర్‌ఎస్ పకడ్బందీగా చేసిన పోల్ మేనేజ్‌మెంట్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ చీల్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే బీఆర్‌ఎస్‌కే సానుకూలత ఉందని చెప్పినట్టు సమాచారం. లెక్కింపు సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారని.. ఏజెంట్ల నియామకం మొదలు ప్రక్రియ పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడే క్రమంలో పార్టీ అభ్యర్థులతో టచ్‌లో ఉండాలని సూచించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications