బ్రాహ్మణులపై కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లల్లోని గోపనపల్లి వద్ద నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ తరహా సదన్ ఏర్పాటు కావడం దేశంలోనే తొలిసారి. మరే రాష్ట్రంలో కూడా ఇలాంటిది లేదు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్య్మానందేంద్ర స్వామి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది.
ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ మాట్లాడారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణుల సంక్షేమాభివృద్ధి కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనికోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలను కేటాయిస్తోన్నామని అన్నారు. సమాజ శ్రేయస్సును కోరే బ్రాహ్మణులకు చేయూత అందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

దేశంలో ప్రత్యేకంగా బ్రాహ్మణ సదన్‌ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పిందని అన్నారు. వేద పండితులకు మంజూరు చేస్తోన్న నెలవారీ గౌరవ వేతనాన్ని 2,500 నుంచి 5,000 రూపాయల వరకు పెంచుతున్నామని, ఈ పథకం కింద లబ్ధిదారుల అర్హత వయస్సు 75 నుంచి 65 సంవత్సరాలకు కుదిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాలకు ధూప, దీప నైవేద్యం కింద అందిస్తోన్న 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ పథకం కింద మరిన్ని ఆలయాలను చేర్చుతామని, దీని పరిధిలోకి 6,441 దేవాలయాలను తీసుకొస్తామని చెప్పారు. వేదపాఠశాలల కార్యకలాపాలు, నిర్వహణ కోసం అందజేస్తోన్న రెండు లక్షల రూపాయల సహాయాన్ని వార్షిక గ్రాంట్‌గా మార్చుతామని అన్నారు.
ఐఐటీ, ఐఐఎంలల్లో విద్యను అభ్యసించే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు ఇంబర్స్‌మెంట్‌ను కూడా పొడిగించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. అనువంశిక అర్చకుల సమస్యలను కూడా మంత్రివర్గంలో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్ జ్యోతి- ప్రత్యేకంగా బ్రాహ్మణ సదన్‌ను నిర్మించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications