గ్రామజ్యోతి: ప్రారంభం ఎప్పుడు ఎక్కడ, కేసీఆర్ ఏమన్నారు?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'గ్రామజ్యోతి' పథకాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కానుంది. ఆగస్టు 17వ తేదీన సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే వెల్లడించారు.
గురువారం ఆయన గ్రామజ్యోతి కార్యక్రమంపై మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 17 నుంచి 24 వరకు గ్రామగ్రామాన ‘గ్రామజ్యోతి' పేరిట వారోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. పంచాయితీలకు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. మండాలనికో అధికారి ఇంఛార్జ్‌గా వ్యవహారించాలని తెలిపారు. గ్రామ కార్యదర్శలు పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు.

అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తుత తీసుకోవాలని కోరారు. రాబోయే ఐదేళ్లకు ప్రతి గ్రామానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామజ్యోతి పథకం విజయవంతం అయ్యేందుకు గాను ఒక్కో మండలానికి ఒక్కో అధికారిని నియమిస్తామని చెప్పారు.
ప్రత్యామ్యాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి: కేటీఆర్
గ్రామ పంచాయితీలు అభివృద్ధి చెందేందుకు ఎన్నో మార్గాలున్నాయని పంచాయితీ రాజ్ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీలు కేవలం ఇంటి పన్నులపైనే కాకుండా ప్రత్యామ్యాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధి కోసమే ప్రభుత్వం 'గ్రామజ్యోతి' పథకాన్ని ప్రవేశపెడుతోందన్నారు. అధికారులు ఈ పథకాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.