ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్...
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 1.48 గంటలకు శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్‌కు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో మొత్తం 1300 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.వచ్చే ఏడాది దసరా నాటికి దీని నిర్మాణం పూర్తి కావాలని కేసీఆర్ భావిస్తున్నారు.దీని ప్రారంభోత్సవానికి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలను ఆహ్వానించి ఘనంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించేందుకే ఢిల్లీలో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

రెండేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు సాగించిన సంగతి తెలిసిందే. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. అయితే ఆ తర్వాత అది ముందుకు సాగలేదు. కారు సారు పదహారు... ఢిల్లీలో సర్కార్ నినాదంతో టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో ప్రచారం చేయగా... కేవలం 9 స్థానాలే గెలుచుకోలిగింది. ఆ తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్తావన మరుగునపడింది. ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణమైన తర్వాత కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి :
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్‌కు భూమిపూజ చేయడం సంతోషంగా,గర్వంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2001లో ఒక్క అడుగుతో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం.. ఈ 20 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ నగరం నడిబొడ్డుకు చేరిందన్నారు. ఇవాళ ఢిల్లీ నగరం నడిబొడ్డుపై గులాబీ జెండాను ఎగరవేయడం ఎన్నటికీ మరిచిపోలేని విషయమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందన్నారు.రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండగ
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం(సెప్టెంబర్ 2) గులాబీ జెండా పండగను ఘనంగా నిర్వహించారు. ప్రతీ గ్రామంలో,పట్టణాల్లో,నగరాల్లో అంతటా వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయాల వద్ద గులాబీ జెండాను ఆవిష్కరించారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ ఇందులో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి నెలరోజుల్లోగా గ్రామ స్థాయి మొదలు జిల్లా కమిటీల ఏర్పాటును పూర్తి చేయనున్నారు.ఇందుకోసం స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రతీ కమిటీలో 51శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలు,మహిళలు ఉండాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు.












Click it and Unblock the Notifications