ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం - సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : నేడు ఢిల్లీకి..!!
తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ అంశం పైన టీఆర్ఎస్ నేరుగా బీజేపీకి అస్త్రాలను ఎక్కు పెడుతోంది. బీజేపీ కౌంటర్ ఎటాక్ తో నేరుగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం పైన విచారణ డిమాండ్ చేస్తోంది. అటు అభియోగాలు ఎదుర్కొంటున్న వారి రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. ఇక, ఇదే అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్ర పైన ముఖ్యమంత్రి మీడియా ముందుకు రావటంతో పాటుగా ఆధారాలను బయటపెడతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, కేసీఆర్ తన ఆలోచన మార్చుకున్నారు. బీజేపీని జాతీయ స్థాయిలో ఇరుకున పెట్టటానికి ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా వ్యూహం. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాలను కూలదోసిందీ..ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతుందంటూ వివరించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారని తెలస్తోంది. మొయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా సాగిన మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆఢియో - వీడియో టేపులను కేసీఆర్ పరిశీలించారని చెబుతున్నారు.

దీంతో తానే నేరుగా ఢిల్లీ కేంద్రంగా వీటిని బయట పెట్టటం త్వారా బీజేపీని ఢిల్లీ వేదికగా ఇరుకున పెట్టాలనేది ఆయన లక్ష్యంగా తెలుస్తోంది. ఈ వ్యవహారం పైన పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇటు పార్టీ నేతలెవరూ ఈ వ్యవహారం పైన స్పందించవద్దంటూ కేటీఆర్ సూచించారు. బీజేపీ నుంచి వస్తున్న స్పందనలను పరిశీలించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి- బీజేపీకి మధ్య సంబంధాల రుజువు కోసం ఆధారాల పైన ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. స్వామీజీల ఫోన్లలోనూ అత్యంత విలువైన సమాచారం ఉందని చెబుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియోలూ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
వీటి ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని జాతీయ స్థాయిలో బట్టబయలు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపైన స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ఇదంతా కేసీఆర్ ఆడిన నాటకం. మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కట్టుకథ అల్లారని చెప్పుకొచ్చారు.ఈ మొత్తం వ్యవహారం పైన సీఎం మాట్లాడితే బీజేపీ ఢిఫెన్స్ లో పడుతుందని సూచించగా, దీని పైన ఇతర పార్టీల నేతలతోనూ మాట్లాడి.. ఢిల్లీలోనే పూర్తి సమాచారంతో ఈ అంశాన్ని పేలుద్దామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే, ఇప్పుడు పట్టుబడిన వారికి బీజేపీతో సంబంధాల పైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం హైదరాబాద్ టు ఢిల్లీకి చేరిక హస్తిన వేదికగా కొత్త టర్న్ తీసుకోనుంది.












Click it and Unblock the Notifications