పల్లాకు లైన్ క్లియర్, రెండో లిస్టు సిద్దం - తొలి జాబితాలో మార్పులు..!!
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్(BRS) తమ అభ్యర్దుల జాబితా ప్రకటించింది. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) అభ్యర్దుల ఎంపిక పైన కుస్తీ పడుతున్నాయి. ఈ సమయంలోనే పెండింగ్ లో ఉన్న స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్దులు ఖరారరయ్యారు. అధికారిక ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో మారుతున్న సమీకరణాలతో తొలి జాబితాలోనూ స్వల్ప మార్పులు తప్పేలా లేవు.
రెండో లిస్టు సిద్దం:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్(CM KCR) హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. గత నెల 21న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకే మరోసారి అవకాశం ఇచ్చింది. అయితే ఆయన కాంగ్రెస్(congress) గూటికి చేరడంతో, ఈ నియోజకవర్గంతో పాటు గతంలో పెండింగులో పెట్టిన జనగామ, నర్సాపూర్, గోషామహల్ బీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు.

వారు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు పచ్చజెండా ఊపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజిగిరి), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్) పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక నాంపల్లి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కసరత్తు కూడా ఒకటి రెండు రోజుల్లో కొలిక్కిరానుంది.
స్వల్ప మార్పులు:విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించిన నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ గతంలో ప్రకటించిన తొలి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల్లోని కీలక అసమ్మతి నేతలను ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ గూటికి చేర్చే వ్యూహానికి పార్టీ అధినేత కేసీఆర్ పదును పెడుతున్నట్లు సమాచారం. అసంతృప్తులకు కళ్లెం వేసేందుకు బీఆర్‌ఎస్ మరింత ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో పాటు ప్రవీణ్ (బెల్లంపల్లి), నరోత్తమ్ (జహీరాబాద్), గోలి శ్రీనివాస్‌రెడ్డి (కల్వకుర్తి), బక్కి వెంకటయ్య (దుబ్బాక) తదితరులకు ఇటీవల ప్రభుత్వ పదవులను అప్పగించారు.

కీలక నిర్ణయాల దిశగా:టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగామ), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘనపూర్)కు కూడా కీలక పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే టికెట్ దక్కని ఎమ్మెల్యే బేతి సుభా‹Ùరెడ్డి (ఉప్పల్)తో పాటు నేతలు గడ్డం అరవింద్ రెడ్డి (మంచిర్యాల), నీలం మధు (పటాన్‌చెరు), మన్నెం రంజిత్ యాదవ్, బుసిరెడ్డి పాండురంగారెడ్డి (నాగార్జునసాగర్) చందర్‌రావు (కోదాడ) తదితరులు అభ్యర్థులను మార్చాలని ఒత్తిడి పెంచుతున్నారు.
కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేవలం మూడు నెలల కాలంలోనే మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామాలతో స్థానిక పరిస్థితులు..సర్వేల లెక్కలు..ప్రత్యర్ది పార్టీల అభ్యర్దులను పరిగణలోకి తీసుకొని స్వల్ప మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications