ఎన్నికల మూడ్‌లో కేసీఆర్- మరో జిల్లా టూర్
సూర్యాపేట్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వరుసగా జిల్లాల పర్యటనలను చేపట్టారు. ఇటీవలే నాగర్‌కర్నూల్, మంచిర్యాల్, జోగాళాంబ గద్వాల్ జిల్లాల్లో పర్యటించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలు, బీఆర్‌ఎస్ జిల్లా ఆఫీస్‌ను ప్రారంభించారు. మంచిర్యాల్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగ సభలో భారీ వరాలు కురిపించారు.

సింగరేణి కార్మికులకు 700 కోట్ల రూపాయల దసరా బోనస్‌ను ప్రకటించారు. అలాగే వికలాంగుల పింఛన్ మొత్తాన్నీ 1,000 రూపాయలకు పెంచారు. రూ.3,116 ఉన్న పింఛన్ మొత్తాన్ని ఒకేసారి 4,116 రూపాయలకు పెంచుతున్నట్లు మంచిర్యాల్ సభలో వెల్లడించారు కేసీఆర్. జోగుళాంబ గద్వాల్ జిల్లా పర్యటనలోనూ కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఇక తాజాగా సూర్యాపేట్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారాయన. ఈ నెల 24వ తేదీన ఈ జిల్లా పర్యటించనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. వాటితో పాటు, కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనాన్ని, సమీకృత మార్కెట్‌ను కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ సారి కేసీఆర్ ఎలాంటి వరాలు ప్రకటిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నెల 8వ తేదీన వరంగల్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభపైనా కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించే అవకాశాలు లేకపోలేదు. లక్షమందికి పైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications