కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడుదొంగలే: సీఎం ధామీ, ఓటర్లకు కిషన్ రెడ్డి పిలుపు
హైదరాబాద్: దేశంలో శాంతి భద్రతలు కొనసాగాలంటే మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఓటేసిన తర్వాత ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు వచ్చి దేశ ప్రజలను చంపేవారని.. ప్రధాని మోడీ హయాంలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. దేశంలో మత కలహాలు కావాలా? శాంతి కావాలా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో జమ్ముకాశ్మీర్‌లోనే 42 వేల మంది పౌరులను ఉగ్రవాదులు చంపారని కిషన్ రెడ్డి తెలిపారు. హస్తం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్థాన్ ఏమనుకుంటే అది భారత్‌లో జరిగేదని ఆరోపించారు. మోడీ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ పాలనలో పాకిస్థాన్ తోక కత్తిరించామన్నారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్ కోసం మోడీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు.
మరోవైపు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ మోడీ సర్కార్ రావాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కారు షెడ్డుకు వెళ్లిందని, ఇక అది రిపేర్ అయ్యే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ప్రతి వ్యక్తికి ఉత్తరాఖండ్‌లో యూసీసీ యాక్ట్ తీసుకొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని పుష్కర్ సింగ్ అన్నారు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా..? మహిళలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇస్తున్నారా..? మీరంతా ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడుదొంగలు అని విమర్శించారు. తాను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని మోడీ స్పష్టం చేశారని తెలిపారు. అంతకన్నా గ్యారంటీ ఇంకేం కావాలని దామి నిలదీశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీకి సరితూగే వ్యక్తి విపక్ష కూటమిలో బూతద్దం పెట్టి వెతికినా కన్పించరని అన్నారు. ప్రపంచంలో ఆర్థికంగా 11వ దేశంగా ఉన్న భారత్‌ను 5వ స్థానానికి మోడీ తీసుకువచ్చారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ ఇండియా కింద ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. పది సంవత్సరాల్లో ఒక్క రిజర్వేషన్ ఎత్తివేయలేదని, రద్దు అనే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications