పోలవరం సహా ఏపీ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న, నిర్మించతలపెట్టిన నీటి ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. 2022లో వచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురైందని, 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని.. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందన్నారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు తెలపాలని, అవసరమైతే గోదావరి బోర్డ్, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
యాదగిరిగుట్ట మహా కుంభాభిషేకానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
యాదగిరిగుట్ట శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం జరగనుంది.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌తో పాటు యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆహ్వానాన్ని అందజేశారు.












Click it and Unblock the Notifications