సెలవులు రద్దు - సీఎం రేవంత్ ఆదేశాలు, ప్రజలకు విజ్ఞప్తి...!!
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి టెలి కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు సేకరించారు.
అధికారులకు పలు కీలక సూచనలు చేసారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు.
సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ భారీ వర్షాల పై సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం ఆదేశించారు.

ఆదేశాలు
అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని నిర్దేశించారు. అత్యవసర పనుకుంటే తప్ప ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా..అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
అప్రమత్తం
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 24 గంటలు అలెర్ట్‌గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఏం ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాల్లో జల దిగ్బంధనం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లపైకి నీళ్లు రావటంతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించారు. ముందస్తు చర్యల పైన అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications