దంచి కొడుతున్న వాన, ముంచుకొస్తున్న ముప్పు- ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో వానలు మళ్లీ దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాగల రెండు, మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది. దీంతో, ప్రభుత్వం అప్రమత్తం అయింది. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు.. రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. దీంతో, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications