ముఖ్యమంత్రి సహాయ నిధి పొందాలంటే..నేరుగా ఇలా..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుసగా పాలనా పరమైన అంశాల పైన రేవంత్ ఫోకస్ చేసారు. వచ్చే వారం ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఇదే సమయంలో ఉద్యోగాల నోటిఫికేషన్ సైతం అసెంబ్లీ వేదికగానే ప్రకటించనున్నారు. ఇక..ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు నేరుగా పొందే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నూతన విధానం అందుబాటులోకి తెచ్చింది.
రేవంత్ నిర్ణయంతో
సీఎంఆర్‌ఎఫ్ అమలును పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఆన్‌లైన్ లో స్వీకరించనుంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీని కేటాయించింది.

ఆన్ లైన్ లోనే
వారి వద్దకు వెళ్తే పేషెంట్ల వివరాలను సీఎంఆర్ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవా.. కాదా.. అనే వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్లో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు సీఎంఆర్‌ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకుని వారి సిఫార్సు లేఖను అప్‌లోడ్ చేస్తారు. దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు.
లబ్దిదారునికి నేరుగా
అప్లికేషన్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత సంబంధించిన కోడ్ ఇవ్వనున్నారు ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధారణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధిత ఆసుపత్రులకు పంపబడుతుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, దరఖాస్తు ఆమోదించి లబ్దిదారునికి చెక్కు సిద్ధం చేయబడుతుంది. దరఖాస్తుదారు ఖాతా సంఖ్య చెక్కుపై ముద్రించబడుతుంది. దీంతో చెక్ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు స్వయంగా దరఖాస్తుదారులకు చెక్కులను అందజేస్తారు.












Click it and Unblock the Notifications