వాజ్‌పేయి చేశారు.. మోదీ చేయలేరా?

Delimitation: దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.

ఏకతాటిపైకి..

ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Stalin

అతిపెద్ద స‌వాల్‌..

ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుతం దేశం ఎదుర్కొంటోన్న అతిపెద్ద స‌వాల్‌గా అభివర్ణించారు. బీజేపీ జ‌నాభా జ‌రిమానాల విధానాన్ని కొన‌సాగిస్తోందంటూ విమర్శించారు.

జ‌నాభా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌ం..

1971లో జ‌నాభాను నియంత్రించాల‌ంటూ దేశం నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి ద‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌లు చేస్తే ఉత్త‌రాదిలోని పెద్ద రాష్ట్రాలు జ‌నాభా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయని, జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, ఉద్యోగాల క‌ల్ప‌న‌, మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సుప‌రిపాల‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో పురోగమించాయని అన్నారు.

రూపాయి చెల్లిస్తే 29 పైసలు..

దేశ ఖ‌జానాకు దక్షిణాది రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులను ఇస్తోన్నప్పటికీ కేంద్రం వెనక్కి ఇచ్చే మొత్తం మాత్రం చాలా త‌క్కువగా ఉంటోందని రేవంత్ రెడ్డి చెప్పారు. త‌మిళ‌నాడు ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైస‌లే వెన‌క్కి వ‌స్తోంటే, ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు రూపాయికి రెండు రూపాయ‌ల 73 పైస‌లు వెళ్తోన్నాయని గుర్తు చేశారు.

తెలంగాణ‌ రూపాయికి 41 పైస‌లు..

బిహార్‌ రూపాయి చెల్లిస్తే 9 రూపాయ‌ల 22 పైస‌లు వెన‌క్కి తీసుకుంటోందని రేవంత్ పేర్కొన్నారు. క‌ర్ణాట‌క‌ రూపాయికి 14 పైస‌లు మాత్రమే కేంద్రం నుంచి తీసుకుంటోందని అన్నారు. తెలంగాణ‌ రూపాయికి 41 పైస‌లు, కేర‌ళ‌ 62 పైస‌లు మాత్ర‌మే వెన‌క్కి వ‌స్తోన్నాయని వివరించారు.

జాతీయ ఆరోగ్య మిష‌న్ కేటాయింపుల్లోనూ..

అదే స‌మ‌యంలో మ‌ధ్య ప్ర‌దేశ్ రూపాయి ప‌న్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెన‌క్కి రూ.2.79 పైస‌లు తీసుకుంటోందంటూ రేవంత్ తెలిపారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయింపులు, ప‌న్ను చెల్లింపులు క్ర‌మంగా త‌గ్గిస్తోందని, చివ‌ర‌కు జాతీయ ఆరోగ్య మిష‌న్ కేటాయింపుల్లోనూ ఉత్త‌రాది రాష్ట్రాల‌కే 60 నుంచి 65 శాతం నిధులు ద‌క్కుతున్నాయని అన్నారు.

అంగీక‌రించబోం..

ఈ పున‌ర్విభ‌జ‌న‌ను అంగీక‌రించబోమని, ఇది దక్షిణాది రాష్ట్రాల రాజ‌కీయ కుదింపునకు దారి తీస్తుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంచి ప్ర‌గ‌తి సాధిస్తున్న రాష్ట్రాల‌ను ఈ ప్ర‌క్రియ శిక్షిస్తోందని ధ్వజమెత్తారు. ఈ అస‌మ‌గ్ర‌మైన పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌కుండా దక్షిణాది మొత్తం కూడా బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచొద్దంటూ..

డీలిమిటేషన్ కింద లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచొద్దంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉన్న సీట్ల‌తోనే పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలని డిమాండ్ చేశారు. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అలానే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టిందని గుర్తు చేశారు. అలా జరగకుంటే రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ తేడాలు, అస‌మ‌తౌల్యాలు వ‌చ్చేవని అన్నారు.

వాజ్‌పేయి నేతృత్వంలో..

2001లో ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయి నేతృత్వంలోని ప్ర‌భుత్వం పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను అలానే ప్రారంభించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. లోక్‌స‌భ సీట్ల‌ను అదే సంఖ్య‌లో ఉంచుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టలేరా అంటూ నిలదీశారాయాన.

ద‌క్షిణాది వ్య‌తిరేకం..

జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక పున‌ర్విభ‌జ‌ను ద‌క్షిణాది వ్య‌తిరేకిస్తోందని రేవంత్ తేల్చి చెప్పారు. బీజేపీ ప్ర‌తిపాదిస్తున్న జ‌నాభా దామాషా ప‌ద్ద‌తిలో పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ద‌క్షిణాది రాష్ట్రాలైన మ‌నం రాజ‌కీయ గ‌ళం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్త‌రాది రాష్ట్రాలు తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా త‌గ్గించి వేస్తుందని అన్నారు.

దేశంపై ఆధిప‌త్యం..

జ‌నాభా ప్రాతిపదిక‌న పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛత్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిప‌త్యం చ‌లాయిస్తాయ‌నే ఎవరూ కాదనలేరని చెప్పారు. ఏ ప‌రిస్థితుల్లోనూ దీనికి అంగీక‌రించ‌కూడ‌దని స్పష్టం చేశారు. బీజేపీ అనుస‌రిస్తున్న ఈ విధానానికి వ్య‌తిరేకంగా ద‌క్షిణాది ప్ర‌జ‌లు, పార్టీలు, నాయ‌కులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ప్రొరేటా విధానం కూడా..

ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాదికి న‌ష్ట‌మే క‌లిగిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. ప్రొరేటా ప్ర‌క్రియ కూడా రాజ‌కీయ అంత‌రాల‌ను పెంచుతుందని, ఈ విధానాన్ని పాటిస్తే సీట్ల మ‌ధ్య తేడా.. కేంద్రంలో ఏ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని నిర్ణ‌యిస్తుందని, ఒక్క సీటు కూడా తేడాను చూపుతుందని అన్నారు.

ఒక్క సీటుతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌డిపోయిన చ‌రిత్ర..

ఒక్క సీటుతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌డిపోయిన చ‌రిత్ర దేశంలో ఉందని గుర్తు చేశారు. ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాది రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తుందని చెప్పారు. వాటన్నింటికీ బదులుగా మోదీ.. వాజ్‌పేయి విధానాన్ని అనుసరించడమే మేలని రేవంత్ అభిప్రాయపడ్డారు.

మ‌రో 25 ఏళ్ల‌ పాటు..

మ‌రో 25 ఏళ్ల‌ పాటు లోక్‌స‌భ సీట్ల‌లో ఎలాంటి మార్పూ తీసుకురాకూడదని రేవంత్ అన్నారు. సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలని, ఈ విషయంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని, ఆ రాష్ట్రంలో ఉన్న జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని డిమాండ్ చేశారు.

ప్ర‌తి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు..

ఆయా రాష్ట్రాల్లోని న‌గ‌రాలు, గ్రామాల్లోని జ‌నాభా ఆధారంగా లోక్‌స‌భ సీట్ల హ‌ద్దుల‌ను మార్పు చేయాలని, తాజా జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలని, ప్ర‌తి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలని, లోక్ స‌భ స్థానాల పెంపును మ‌రో 25 ఏళ్ల‌పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు రేవంత్.

Revanth

పార్ల‌మెంటరీ వ్యవస్థ..

పార్ల‌మెంటరీ వ్యవస్థ దేశానికి విధాన‌ప‌ర‌మైన శాస‌నాల‌ను రూపొందిస్తుందే త‌ప్ప ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌పై నిర్ణ‌యాలు చేయ‌దని, ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌ను స్థానిక సంస్థ‌లు, రాష్ట్రాలు, శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనే ప‌రిష్కారమ‌ౌతాయని ఆయన అన్నారు.

శిక్షించే విధానానికి కేంద్రం స్వ‌స్తి..

జనాభా నియంత్ర‌ణ‌కు సంబంధించి ద‌క్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వ‌స్తి చెప్పాలని, దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వ‌ర‌కు 50 ఏళ్ల పాటు మ‌నం అందించిన సేవ‌ల‌కు ఆయా రాష్ట్రాలను కేంద్రం ప్రత్యేకంగా అభినందించి తీరాలని, మ‌న‌కు వెన‌క్కి కొంత మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.

జ‌నాభా దామాషా ప్రాతిపదిక‌న..

జ‌నాభా దామాషా ప్రాతిపదిక‌న చేసే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టొద్ద‌ని ద‌క్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి దేశంలోని ఇత‌ర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లే ద‌క్షిణాదికి అవ‌కాశం ఇవ్వాలి.. అని రేవంత్ తేల్చి చెప్పారు.

లోక్‌స‌భ‌లో 33 శాతం..

543 సీట్లు ఉన్న లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం ద‌క్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130. ఇది మొత్తం సీట్ల‌లో 24 శాతం. పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డే నూత‌న లోక్‌స‌భ‌లో 33 శాతం సీట్లు ఇవ్వాల‌నేది ద‌క్షిణాది రాష్ట్రాలుగా తమ డిమాండ్‌ అని అన్నారు.

ద‌క్షిణాది రాష్ట్రాల‌కు 272 సీట్లు..

బీజేపీ 50 శాతం సీట్ల‌ను పెంచాల‌నుకుంటే అలా పెరిగే 272 సీట్ల‌తో మొత్తం లోక్ స‌భ సీట్ల సంఖ్య 815 అవుతుందిని, ఇందులో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలని చెప్పారు. ఈ సీట్ల‌ను త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరిల‌కు ఇప్పుడున్న‌ ప్రొరేటా ప్రాతిప‌దిక‌న పంచ‌వ‌చ్చని సూచించారు.

దేశ రాజ‌కీయ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం..

దేశంలో మిగిలిన సీట్ల‌ను ఉత్త‌రాది, ఇత‌ర రాష్ట్రాల‌కు కేంద్రం త‌మ అభిమ‌తం మేర‌కు పంచ‌వ‌చ్చని, అనుకున్న దానికంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సీట్ల సంఖ్య త‌గ్గిస్తే అది దేశ రాజ‌కీయ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుందని రేవంత్ పేర్కొన్నారు. ద‌క్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు, రాజ‌కీయ పార్టీలు మ‌న విభేదాల‌ను విస్మ‌రించి పున‌ర్విభ‌జ‌న‌లో వాటా ద‌క్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తిచేశారు.

Take a Poll

శాస‌న‌స‌భ‌లో తీర్మానం..

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త్వరలో తమ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో తీర్మానం ఆమోదిస్తామని రేవంత్ ప్రకటించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా అలానే చేయాల‌ని స‌హ‌చ‌ర ముఖ్య‌మంత్రులు, ఇత‌ర నాయ‌కులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాని అన్నారు. ద‌క్షిణ భార‌త‌దేశ పౌరుల గ‌ళాన్ని బ‌లంగా, ఐక్యంగా మొత్తం భార‌త దేశానికి వినిపిద్దామని అన్నారు.

హైద‌రాబాద్‌లో..

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తానని, మ‌న పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ‌దామ‌నే విష‌యాన్ని ఆ స‌మావేశంలో చ‌ర్చిద్దామని అన్నారు. ఈ పోరాటంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు ఒక భారీ బ‌హిరంగ స‌భ‌ను నేను ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+