Revanth Reddy: ఆ ఇద్దరి పైనే రేవంత్ భారం - ఏరి కోరి ఎంపిక..!
తెలంగాణ మఖ్యమంత్రి రేవంత్ తన టీంను సిద్దం చేసుకుంటున్నారు. కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా వి శేషాద్రిని ఎంపిక చేసుకున్నారు. నియామక ఉత్తర్వులు జారీ చేసారు. అదే విధంగా పాలనలో కీలకమైన నిఘా వ్యవస్థ చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ శివధర్ రెడ్డిని నియమించారు. శేషాద్రికి రెవిన్యూ - భూ వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉంది. గతంలో ప్రధాని కార్యాలయం .. కేసీఆర్ వద్ద కార్యదర్శిగా పని చేసారు.
శేషాద్రికి ప్రాధాన్యత: తెలంగాణ సీఎం రేవంత్ కీలక నియామకాల పైన కసరత్తు చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ వి.శేషాద్రిని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. 1999 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన శేషాద్రికి రెవెన్యూ చట్టాలు, భూ వ్యవహారాల్లో అపారమైన పరిజ్ఞానం, అవగాహన ఉంది.

2013 ఆగస్టు 22 నుంచి 2020 ఆగస్టు 22 వరకు ప్రధాన మంత్రి కార్యాలయం (జీఏడీ)లో డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ హోదాల్లో ఆయన డిప్యుటేషన్ మీద పని చేసారు. తరువాత సీఎం కేసీఆర్ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ధరణి ప్రాజెక్టులో కీలకంగా పని చేసారు. 2022 నుంచి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
రేవంత్ టీంలో కీలకంగా: ముఖ్యంగా తెలంగాణలోని భూములు, రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన 'ధరణి' పోర్టల్‌లో ఆయన కీలక భాగస్వామి. అప్పట్లో కేంద్ర సర్వీసుల్లో ఉన్న శేషాద్రిని కేసీఆర్ రాష్ట్రానికి తెప్పించుకున్నారు. గతంలో ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు కలెక్టర్‌గా సేవలందించారు. ఆయన ఏనాడూ అవినీతి ఆరోపణలను ఎదుర్కోలేదు.

పైగా ముక్కు సూటి మనషి అనే పేరుందని అధికారులు చెబుతుంటారు. శేషాద్రికి కీలక బాధ్యతలను అప్పగించడాన్ని బట్టి.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవచ్చని వారు అంటున్నారు. రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ధరణి పోర్టల్‌పై ఆరోపణలు చేశారు. ఆ పోర్టల్‌ను సంస్కరిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. శేషాద్రికి ఆ బాధ్యతలను అప్పగించినట్లు స్పష్టమవుతోంది.

నిఘా బాస్ గా శివధర్ రెడ్డి: రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అదనపు డీజీ శివధర్‌రెడ్డిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు చెందిన శివధర్‌రెడ్డి కూడా నిజాయితీపరుడని పేరు తెచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్ , కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ నక్సల్స్ ఇంటెలిజెన్స్ వింగ్-ఎస్ఐబీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి విభాగాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఆయన ఐజీ ర్యాంకులో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రెండేళ్లపాటు సేవలందించారు. హైదరాబాద్ పాతనగరంలో.. దక్షిణ మండలం డీసీపీగా ఆయన పనిచేసిన సమయంలో మతకల్లోలాలను సమర్థంగా నియంత్రించారు. ఈ కారణాలతో శివధర్‌రెడ్డికి కీలక పదవిని ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications