ఏపీకి రేవంత్ ఆల్టిమేటం
ఏపీ- తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణలోని పలు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ మోకాలడ్డుతోందని ఆయన భావిస్తోన్నారు. తెలంగాణ ప్రాణాధారమైన ప్రాజెక్టులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్, జటప్రోలులో ప్రతిపాదిత యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కడ మదనగోపాల స్వామి వారి ఆలయం చేరుకుని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన అనంతరం, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు.

తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని, వీలైతే సహకరించాలని కోరారు.
తమ విజ్ఞప్తులను వినకపోతే పోరాటం చేసి సాధించుకుంటామని, నాయకత్వం వహించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు రెండు రాష్టాలు సమంగా, తెలుగు వారు అభివృద్ధి సాధించాలన్న ఆలోచనే నిజమైతే రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రతిపాదిత నీటి పారుదల ప్రాజెక్టులు, మహిళాభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాల వంటి అంశాలను రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవద్దని, అడ్డుపడితే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మా ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. అక్కడి సూర్యుడి ఇక్కడ పొడిచినా ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. పాలమూరు వలసల జిల్లా కాదు. పరిపాలన అందించే జిల్లాగా నిరూపిస్తాం. చంద్రబాబు నాయుడుకు మా విజ్ఞప్తి. వారు బాధ్యతగా వ్యవహరించాలి. సహకరించి ఉదారతను చాటుకోవాలి.. అని చెప్పారు.
పాలమూరు - రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, భీమా కోయిల్ సాగర్, నెట్టెంపాడు అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి అందరికీ నష్ట పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రెండేండ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.
అలాగే- తుమ్మిడిహెట్టి నుంచి వికారాబాద్, తాండూరు, చేవెళ్ల వరకు నీరు తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణగా పేర్కొన్నారు.
ఎస్సీ ఉపకులాలకు నష్టం వాటిల్లకూడదని వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యాక భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కొంతకాలం ఆపి ఇప్పుడు పూర్తి చేయబోతున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాల కాలం పూర్తయ్యే లోపు మరో 40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు.
మొత్తంగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా, తెలంగాణ మోడల్ ను ఆవిష్కరిస్తామని, విదేశీ పర్యటనల సందర్భంగా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగావకాశాలు కల్పించామని రేవంత్ వివరించారు.
అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్రం చేయలేనన్ని సంక్షేమ పథకాలు మహిళలకు అందించామని, మహిళలను చైతన్యవంతులను చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని లక్ష్యంగా నిర్దేశించామని అన్నారు. తెలంగాణ 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 344 కోట్ల రూపాయల చెక్కును అందించారు. అలాగే బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, లోన్ బీమాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. పలువురు లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications