రేవంత్ రెడ్డి రిక్వెస్ట్‌కు ప్రియాంక గాంధీ సై
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోమవారమే రేవంత్ రెడ్డి దేశ రాజధానికి చేరుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశం కానున్నారు.
ప్రజాపాలన విజయోత్సవాలకు వారిని కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పండుగ వాతావరణంలో ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.

తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించేలా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
అదే వేదికగా గ్రూప్ 4తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్‌ల ద్వారా ఎంపికైన 9,000 మందికి నియామక పత్రాలు అందించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి వరుసగా వారం రోజుల పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు.
అదే నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మూడు రోజుల పాటు సచివాలయం, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో తెలంగాణ వైభవం ఉట్టిపడేలా ఉత్సవాలకు ఏర్పాట్లు సాగుతోన్నాయి.

9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు రేవంత్ రెడ్డి. అదే రోజు సాయంత్రం జరిగే వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఆహ్వానించనుంది. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించనుంది.
ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రాను ఆహ్వానించారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. వాయనాడ్ లోక్‌సభకు జరిగిన ఉఫ ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications