బీజేపీ కుట్రలు, కేసీఆర్ వాళ్ల కంటే ఎక్కువ ద్రోహం చేశారు: రేవంత్ ఫైర్
ఉమ్మడి పాలకులకంటే కేసీఆర్ తెలంగాణకు ఎక్కువ ద్రోహం చేశారని మండిపడ్డారు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఖ్యాతి గుజరాత్ కంటే ఎక్కువగా పెరిగిందని బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, హైదరాబాద్‌లో మతచిచ్చు పెట్టి శాంతిభద్రతలు చెడగొట్టాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్, విమానాశ్రయం, పరిశ్రమలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు సీఎం రేవంత్. ఓఆర్‌ఆర్, విమానాశ్రయం, పరిశ్రమలు వచ్చాకే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పెరిగాయన్నారు. మత కల్లోలాలు లేవు కాబట్టే హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్ల మాటలు నమ్మి రాష్ట్రాన్ని ఆగం చేసుకోవద్దని వ్యాఖ్యానించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో తెస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత షాద్‌నగర్‌కు తెస్తానని స్పష్టం చేశారు. ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు బిడ్డకు, ఢిల్లీ సుల్తాన్‌లకు మధ్య జరుగుతున్న పోరు అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. షెడ్డుకు పోయిన కారు, మళ్లీ తిరిగిరాదన్నారు. కారు పనికిరాకుండా పోయినందునే కేసీఆర్ బస్సెక్కి తిరుగుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.
డీకే అరుణను జడ్పీటీసీ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ అన్నారు. నమ్మిన పార్టీని, కార్యకర్తలకు అన్యాయం చేసిన డీకే అరుణ.. శత్రువు పక్కన చేరిందన్నారు. కాంగ్రెస్ ను ఓడిస్తా.. రేవంత్ రెడ్డిని పడగొడ్తానని సవాల్ చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రజల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను మీ బిడ్డగా తీసుకుంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications