ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఈరోజు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ముందుగా ఆయన వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లికి చేరుకుంటారు. గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పక్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
అలానే పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను సీఎం ప్రారంభిస్తారు. బీపీసీఎల్ సహకారంతో పూర్తిగా మహిళలచే నడిపే పెట్రోల్ బంక్ గా ఇది నిలవనుంది. రాష్ట్రంలోనే మొదటి సారి ఈ తరహా బంక్ ను ప్రారంభించడం ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ పేట మెడికల్ కాలేజీలో అకడమిక్ బ్లాక్ తో పాటు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.

ఇక మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు. తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ను మినహాయించి, మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి సంవత్సరం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠంగా ఏడాదికి 4,50,000 ఇళ్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో భాగంగా ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్ల విడుదల కాగా.. మొతం ఇంటి నిర్మాణం పూర్తి అయ్యే వరకు రూ.5లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.
డబ్బులు జమ ఏ విధంగా అంటే ..?
ఇంటి బేస్ మెంట్ నిర్మించిన తర్వాత లక్ష రూపాయలు లబ్దిదారుడి అకౌంట్ కు జమచేస్తారు. ఆ తర్వాత కిటికీలు, తలుపులు, గోడలు నిర్మించుకోవాలి. ఆ తర్వాత లబ్దిదారుడి అకౌంట్ కు రూ.1.25 లక్షలు జమచేస్తారు. ఆ డబ్బుతో స్లాబ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం రూ.1.75 లక్షలు అకౌంట్ కు జమచేస్తారు. ఈ డబ్బుతో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. తర్వాత చివరిగా రూ.1 లక్ష లబ్దిదారుడి అకౌంట్ కు ప్రభిత్వం జమ చేస్తోంది.












Click it and Unblock the Notifications