ఒక్కరోజు ఆలస్యమైనా ఒప్పుకోను: డెడ్ లైన్ పెట్టిన రేవంత్ రెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పనులు జరగాలని చెప్పారు. 2027 డిసెంబరు 9 లోగా దీన్ని పూర్తి చేయాలని, అదే రోజున తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టారు. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణకు అత్యంత కీలకమని, ప్రపంచస్థాయి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనులు చేపట్టాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా పటిష్టవంతమైన రక్షణ చర్యలతో ముందుకు సాగాలని రేవంత్ చెప్పారు. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు సీఎం.

నీటి పారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, లెఫ్ట్ నెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఇందులో పాల్గొన్నారు. సొరంగం పనుల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. సర్వేతో పాటు పనులు పూర్తి అయ్యేంత వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన అన్ని ఏజెన్సీల సలహాలు, వారి భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని అదేశించారు.
భవిష్యత్ లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్ట్ లకు ఆదర్శంగా ఉండేలా ఎస్ఎల్‌బీసీ నిర్మాణం ఒక కేస్ స్టడీగా నిలవాలని ఆకాంక్షించారు. అటవీ, ఇంధనం, ఇరిగేషన్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ఈ నెల 15 వ తేదీలోగా కేబినేట్ సమావేశమై ఎస్ఎల్‌బీసీ పునరుద్దరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న సమస్యను ఒక్క సమావేశంలోనే పరిష్కారం రావాలని, అటవీ, విద్యుత్ సరఫరా, సొరంగం తవ్వకంలో సింగరేణి నుంచి నిపుణుల సేవల వంటి అన్ని అంశాలు కొలిక్కి రావాలని చెప్పారు. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్న ఈ టన్నెల్ ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని, ఇకనుంచి ఒక్క రోజు కూడా పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పనులు ఆగకుండా ఇన్‌లెట్, అవుట్‌లెట్ రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ పనులకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
మొత్తం 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇప్పటికే 35 కి.మీ సొరంగం తవ్వడం పూర్తయిందని, మిగిలిన తొమ్మిది కిలో మీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్టు ఈ సందర్భంగా పరీక్షిత్ మోహ్ర వివరించారు. ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వే లక్ష్యంగా ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications