ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.. మావోయిస్టులపై షాకింగ్ కామెంట్స్ !
పోలీసులు అంటే సమాజానికి నమ్మకం, భరోసా.. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసే అమరవీరులు మనకు గర్వకారణమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీసు గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం (Police Martyrs' Memorial Day) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని డీజీపీ శివధర్‌కు అందజేశారు.
ప్రమోద్ కుటుంబానికి అండగా..
అలానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల ప్రాణత్యాగాలు ఎప్పటికీ మరచిపోలేనివని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవల వీర మరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం.. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు.

అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశంసలు కురిపించారు. పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. సాంకేతికతను వినియోగించి నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్రవాదం, సైబర్ నేరాలు, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వ్యాప్తి అరికట్టడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
డ్రగ్స్ నిర్మూలనకు 'ఈగల్' బృందం..
మరోవైపు డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రత్యేకంగా 'ఈగల్' పేరుతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతీ రోజూ సైబర్, డిజిటల్, మార్ఫింగ్, డ్రగ్స్ వంటి కొత్త తరహా నేరాలు వస్తున్నాయని.. వాటిని ఎదుర్కోవడానికి మన పోలీసులు టెక్నాలజీనే ఆయుధంగా వాడుతున్నారన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని వివరించారు.
మావోయిస్టులకు పిలుపు..
మావోయిస్టు సమస్యపై సైతం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల అనేకమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని.. ఇంకా అజ్ఞాతంలో ఉన్నవారు కూడా జానా జీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. వారంతా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని.. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in Police Flag Day Parade at Police Martyrs Memorial, Goshamahal, Hyderabad https://t.co/EKN8uC9AFz
— Telangana CMO (@TelanganaCMO) October 21, 2025
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇటీవల 16 వేల కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీ చేపట్టామని.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దేశంలోనే అత్యధిక పరిహారం అందిస్తున్నామని తెలిపారు. పోలీసులు రాజకీయ ఒత్తిడుల నుండి దూరంగా, ప్రజల సేవలో నిరంతరం పనిచేయాలని సూచించారు.
పోలీసుల పిల్లల విద్య కోసం రంగారెడ్డి జిల్లాలో "యంగ్ ఇండియా పోలీస్ స్కూల్" ను ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. అలాగే క్రీడాకారులకు పోలీస్ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా వారికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. మహిళా ఐపీఎస్ అధికారులకు పలు విభాగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications