CM Revanth Reddy: డీలిమిటేషన్‌పై పోరాటం.. సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన డీఎంకే నేతలు
CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున ఆ రాష్ట్ర మంత్రి టీకే నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం ఆహ్వానించింది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో ఈ నెల 22న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) పేరుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇది డీలిమిటేషన్ కాదని.. దక్షిణాది రాష్ట్రాలకు పరిమితి విధించడం అవుతుందని ఆయన అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు బీజేపీని తిరస్కరించడం వల్లే ఇలా చేస్తోందని ఆరోపణలు చేశారు. కర్ణాటకలోనూ బీజేపీకి అధికారం పోయిందని.. అందుకే దక్షిణాదిపై పగ సాధిస్తోందని.. ఏదేమైనా డీలిమిటేషన్ విషయంలో బీజేపీ కుట్రలను సాగనిచ్చే ప్రసక్తే లేదన్నారు. సిద్ధాంతాల పరంగా స్టాలిన్ నిర్ణయంతో కాంగ్రెస్ ఏకీభవిస్తోందన్నారు. ఈ సమావేశానికి వెళ్లాలా లేదా అనేది అధిష్ఠానాన్ని అడిగి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలో నష్టపోతాయని.. తమిళనాడులో 8 లోక్ సభ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంటుందని స్టాలిన్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ లో దక్షిణాది బలం తగ్గడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల బలం పెరిగిపోతుందని స్టాలిన్ పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications