బీ అలర్ట్.. స్కూళ్లకు సెలవులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం - సీఎం రేవంత్
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. రహదారులు నీటమునిగిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రభుత్వం సర్వత్రా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ విభాగం (IMD) రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించడంతో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
72 గంటలు అలర్ట్ మోడ్..
ముఖ్యమంత్రి సూచనల ప్రకారం వచ్చే 72 గంటలు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయి అలర్ట్ మోడ్‌లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తక్షణమే హెచ్చరికలు ఇవ్వాలని.. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరాలని ఆదేశించారు. ఐటీ ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించాలని సీఎం సూచించారు.

అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించబడాలని సూచించారు. విద్యార్థుల భద్రత కోసం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు అధికారులు, సిబ్బంది, ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. ప్రతి జిల్లాలో ఇన్‌చార్జ్ మంత్రులు ఫీల్డ్‌లో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక మానిటరింగ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, రక్షణ బృందాలు, పడవలు, వైద్యసిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
రోడ్లపై నీరు నిలవడం వల్ల వాహన రాకపోకలు అంతరాయం ఎదుర్కొంటున్నాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటి వనరులు కలుషితం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, మరియు పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications