రేవంత్ డిమాండ్ల చిట్టా: హైదరాబాద్ కు రీజినల్ రైల్వే లైన్..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ సాయంత్రం మోదీతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఆయనకు అందజేశారు. వాటిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, అవుటర్ రింగ్ రోడ్, రింగ్ రైల్వే ప్రాజెక్టు, హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ కారిడార్.. వంటి ప్రతిపాదనలు మోదీకి అందజేసిన వాటిల్లో ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఏపీకి అందించిన ప్రోత్సాహాలను ఆయన గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2ను విస్తరించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రధానికి అందజేశారు. మెట్రో రైల్ ఫేజ్-1లో 69 కిలో మీటర్లతో కూడిన మూడు కారిడార్లు ఉన్నాయని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను 22,000 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు తెలిపారు.
నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా మెట్రో రైలును తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. 10 సంవత్సరాల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి విస్తరణ చేపట్టలేదని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్-2 విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించిందని వివరించారు.
ఫేజ్-2లో మొత్తం 76.4 కిలో మీటర్లతో కూడిన అయిదు కారిడార్లు ఉంటాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టాల్సిన జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్. మొత్తం ఖర్చు.. 24,269 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్రం వాటా 18 శాతం అంటే 4,230 కోట్ల రూపాయలు. రాష్ట్రం వాటా.. 30 శాతం అంటే 7,313 కోట్ల రూపాయలు.
రుణాల రూపంలో మరో 48 శాతం అంటే 11,693 కోట్ల రూపాయలను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది అక్టోబరులో చెన్నై మెట్రో ఫేజ్-2కు రూ. 63,246 కోట్లు, 2021 ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్-2కు రూ. 14,788 కోట్లు, 2024 ఆగస్టులో బెంగళూర్ మెట్రో ఫేజ్-3కి రూ. 15,611 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని రేవంత్ రెడ్డి.. మోదీకి వివరించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి గత ఏడాది నవంబర్ 4వ తేదీన కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించామని, వాటిపై కేంద్రం కొన్ని స్పష్టీకరణలు కోరగా, వాటికి సమాధానాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదించాలని కోరారు.
హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో రీజినల్ రింగు రోడ్డును ప్రతిపాదించామని రేవంత్ రెడ్డి వివరించారు. ఆర్ఆర్ఆర్ నార్త్: సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- భువనగిరి- చౌటుప్పల్, ఆర్ఆర్ఆర్ సౌత్: చౌటుప్పల్- అమన్‌గల్- షాద్‌నగర్- సంగారెడ్డి వరకు ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు.
ఆర్ఆర్ఆర్ నార్త్ కోసం 2022లో భూముల సేకరణ చేపట్టారు. భూ సేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరిస్తోందని తెలిపారు. దీనికి సంబంధించిన జాతీయ రహదారుల సంస్థ టెండర్లు పిలిచిందని, దీనికి అవసరమైన ఆర్థిక, కేబినెట్ ఆమోదం తెలపాలని ఆయన మోదీని కోరారు.
ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలతో పాటు హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పుడున్న ఓఆర్ఆర్ వచ్చే అయిదు సంవత్సరాల్లో సరిపోదని, ఇప్పటికే ఓఆర్ఆర్ పై రోజుకు లక్ష సీపీయూ ఉందని వివరించారు. ఆర్ఆర్ఆర్ నార్త్ పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. అందువల్లే రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కిలో మీటర్ల పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించామని, ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుందని రేవంత్ రెడ్డి వివరించారు. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని అన్నారు.
దేశంలోనే తెలంగాణ 35 శాతం ఔషధాలు ఉత్పత్తి చేస్తోందని, బందరుపోర్ట్- డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుందని చెప్పారు. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఏఎండీ, క్వాల్ కామ్, ఎన్ విడియా వంటి ఆర్ అండ్ డీ కేంద్రాలు ఉన్నాయని, పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రభుత్వ-ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఓ, డిఫెన్స్ పీఎస్ యూలు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయని వివరించారు.
రక్షణ రంగంలోని జేవీలు, ఆఫ్ సెట్ లకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రతిపాదించారు రేవంత్ రెడ్డి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఏపీకి కేంద్రం నుంచి ప్రోత్సాహం ఉందని, తమకు లేదని అన్నారు.












Click it and Unblock the Notifications