రేవంత్ రెడ్డి ప్లాన్ అదిరింది..!
ప్రమాణ స్వీకారం చేసిన సమయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. పరిపాలనలో తనదైన శైలిని చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తన కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని, తెలంగాణ ఇంటిలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు. భవిష్యత్తులో మరికొన్ని నియామకాలు చేపట్టడంద్వారా తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు.
అనుభవజ్ఞులైన అధికారులకు ప్రభుత్వంలో పెద్దపీట వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎవరినైతే లూప్ లైన్ లో ఉంచిందో వారికి పెద్దపీట వేసే అవకాశం కనపడుతోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా లూప్ లైన్ లో ఉన్న అధికారులకు విఐపి స్థాయిలో గౌరవం లభించింది. దీనిప్రకారం చూసినా వారికి మంచి ప్రాధాన్యమున్నవే దక్కనున్నాయని అర్థమవుతోంది. కొంతమందిని సీఎం కార్యాలయంలో నియమించే అవకాశం ఉంది. తెలంగాణ స్థానికత ఉన్న అధికారులకు అమితమైన ప్రాధాన్యం దక్కనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర వాణిజ్య పనులు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ శర్మకు కీలక పోస్టు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈయన మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ మనవడు. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి, ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్ కు కీలక పోస్టు దక్కుతుందంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం, వాటర్ బోర్డు ఎండి దాన కిషోర్, సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ శశాంక్ గోయల్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వచ్చని తెలుస్తోంది. వీరందరి నియామకాలు పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు ఉండనున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications