ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు: కేసీఆర్‌కు సూటి ప్రశ్న
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తాజాగా మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు గుర్తించారని, ఈ క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటికి వచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు సమీక్ష జరపలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి మీడియాతో మాట్లాడారు.
అయితే, అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తనకు తెలుసని చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలుంటాయన్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు, ఫోన్ ట్యాపింగ్‌పై ఎందుకు కోరడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని, అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్ప, తనతో కాదని పేర్కొన్నారు. 1980, 90ల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో? బ్యాకప్ కూడా ఉందో లేదా? దాన్ని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు.
అధికారిక చిహ్నంపై ఇలా
తెంలగాణ రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, అవి గుర్తుకువచ్చేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి అప్పగించామని, రాష్ట్ర చిహ్న రూపకల్పన బాధ్యతలు నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.
మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకు వెళతామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాళేశ్వరం సమస్య 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చేది కాదని, విరిగింది వెన్నుముక అని వ్యాఖ్యానించారు. నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, సముద్రంలోకి వెళ్లిన ఆ నీటికీ విద్యుత్ బిల్లులు కట్టామని సీఎం రేవంత్ వివరించారు. ఇక, రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications