రేవంత్ ఎమోషనల్ హోమ్ కమింగ్- ఈ అద్దె ఇంట్లో 12 ఏళ్లు గడిపిన సీఎం
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం వనపర్తి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,000 వేల కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కుట్టు పనిలో శిక్షణ పొందిన ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మతాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు.
గత డిసెంబర్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన అర్హత గల మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది రేవంత్ సర్కార్. వేల సంఖ్యలో దరఖాస్తుల అందాయి అప్పట్లో. మొత్తంగా 40,000 మందిని అర్హులుగా గుర్తించింది. తొలి దశలో తొమ్మిది జిల్లాల్లో 10,490, రెండవ దశలో మిగిలిన జిల్లాల్లో 31,740 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

తొలి విడత కుట్టు మిషన్ల పంపిణీకి నేడు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి. దీనికోసం వనపర్తిని ఎంచుకున్నారు. ఈ టౌన్‌తో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 12 సంవత్సాల పాటు ఇక్కడే ఉన్నారాయన. ఇక్కడే చదువుకున్నారు. ఆ సమయంలో ఓ అద్దె ఇంట్లో గడిపారు.
తన పర్యటన సందర్భంగా ఆ అద్దె ఇంటిని సందర్శించారు రేవంత్ రెడ్డి. స్వయానా ముఖ్యమంత్రి తమ ఇంటికి వస్తోన్నారనే విషయం తెలిసి ప్రస్తుతం అందులో నివసిస్తోన్న కుటుంబం ఉబ్బితబ్బిబ్బయింది. హారతి ఇచ్చి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు ఆ కుటుంబ సభ్యులు. తాను నివసించిన పాత ఇంటిని చూసి రేవంత్ భావోద్వేగానికి గురయ్యారు.
ఆ సందర్శన బాల్య స్మృతులను పంచుకున్నారు. ఈ ఇల్లు- తన జీవితంలో ఒక అధ్యాయంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు రేవంత్. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే గడిపారు. రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు ఈ ఇంట్లోనే అద్దెకు ఉన్నానంటూ చెప్పారు.
ఈ సందర్భంగా తన స్కూల్ ఫ్రెండ్స్‌ను సైతం కలుసుకున్నారాయన. స్థానిక శాసన సభ్యుడు తూడి మేఘా రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన రీ యూనియన్‌లో పాల్గొన్నారు. పాత స్నేహితులతో కలిసి టిఫిన్ చేశారు. అందర్నీ గుర్తు పట్టారు. పేరుపేరునా వారిని పలకరించారు. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు.












Click it and Unblock the Notifications