పని చేస్తేనే ఉండండి: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్
హైదరాబాద్: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అయితే, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సమీక్షించాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదివారం కలెక్టర్లు, సీపీ, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశం సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేమన్నారు సీఎం రేవంత్. నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులే. గ్రామసభలు ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదన్నారు. పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి అని అన్నారు.

అంతేగాక, ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలన్నారు. అధికారులు జవాబుదారీగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ సహిస్తారని.. కానీ, స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని చెప్పారు. ఎంతటివారినైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు.
ప్రజలతో గౌరవం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలని అధికారులకు స్పస్టం చేశారు సీఎం రేవంత్. అంతేగాక, ప్రతి అధికారి పూర్తిస్థాయిలో తమ విధులను నిర్వహించాలని.. చేయలేని వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని తేల్చి చెప్పారు. రోజుకు 18 గంటల పనిచేయాలని.. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్, డీజీపీకి చెప్పి తప్పుకోవచ్చన్నారు సీఎం రేవంత్.

ప్రీ నాలుగు నెలలకోసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయన్నారు. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ తో ఉందని.. అధికారులు ఇచ్చే సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చెప్పారు. ఎస్ఆర్ శంకర్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కబ్జాదారులు, డ్రగ్స్ సరఫరాదారులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. బుక్ మై షో సన్ బర్న్ నిర్వహణపై పోలీసులు నిఘా పెట్టి అసలు విషయం తేల్చాలన్నారు. గంజాయి రవాణాపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలని సీఎం స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.












Click it and Unblock the Notifications