అభివృద్ధి పథంలో తెలంగాణ:సుసంపన్న భవిష్యత్తుకు సీఎం రేవంత్ హామీలు..!
జహీరాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాతో ఇందిరమ్మకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ,జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నిమ్జ్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం నుంచి రాష్ట్ర సమగ్రాభివృద్ధి వరకు పలు కీలక అంశాలపై ఆయన ప్రసంగించారు.
మెదక్ తో ఇందిరమ్మ అనుబంధం, నిమ్జ్ అభివృద్ధి
మెదక్ పేరు వినగానే ఇందిరమ్మ గుర్తుకు వస్తారని, చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా కొనసాగిన గొప్ప నాయకురాలు ఆమె అని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన నిమ్జ్ (NMZ) అభివృద్ధిని తమ ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు. నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారాన్ని పెంచామని, భూసేకరణను వేగవంతం చేశామని వెల్లడించారు. త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు మొదలుపెట్టడం సంతోషంగా ఉందని ఆయన ప్రకటించారు.

ఇందిరమ్మ ఇళ్లు, నిధుల మంజూరు
నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఈ వేదికగా ప్రకటించారు. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి, ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం, నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి కూడా నిధులు ఇస్తామని, సురేష్ షెట్కర్, సంజీవరెడ్డిలు నారాయణఖేడ్‌కు రెండు కళ్లలాంటివారని ప్రశంసించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామని, రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచి, భూమిలేని పేదలకూ భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని గుర్తుచేశారు.
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులను అందించి వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి యువతను మోసం చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిందని వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధికి సహకారం, సభా చర్చకు ఆహ్వానం
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని, అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని పునరుద్ఘాటించారు.
ప్రతిపక్ష నాయకులను శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము ఏదైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వాలని, సరిదిద్దుకుంటామని తెలిపారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామని అనుకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అండగా ఉండాలని, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏనాడు అహంభావం ప్రదర్శించలేదని, అందరినీ కలుస్తున్నానని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నిద్రపోయేది లేదని ఆయన పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications